Attack police | కోరుట్ల, ఆగస్టు 20 : పట్టణంలోని తాళ్ళ చెరువు సమీపంలో విధి నిర్వహణలో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బందిపై ఆకతాయిలు దాడికి పాల్పడిన ఘటన మంగళ వారం జరిగింది..కోరుట్ల ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని తాళ్ళ చెరువు సమీపంలో మంగళవారం రాత్రి గొడవ జరుగుతుందని వంద నంబర్ కు కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న హెడ్ కానిస్టేబుల్ జావీద్, బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ గంగాధర్ లు ఘటన వద్దకు చేరుకున్నారు. అక్కడ కొంతమంది యువకులు మద్యం సేవిస్తుండగా పోలీసులు అడ్డు చెప్పారు.
మద్యం మత్తులో ఉన్న యువకుల మధ్య గొడవను సద్దు మణిగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు యువకులు పోలీసులతో గొడవ పడి దాడి చేశారు. దాడిలో గంగాధర్, జహీద్ లకు గాయాలు అయ్యాయి. గాయపడ్డ సిబ్బందిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. దాడికి పాల్పడిన యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.