రామగుండం రీజియన్ -1 సరికొత్త చరిత్ర సృష్టించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 39.20 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, ఈ నెల 18 నాటికే 39.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. ఒకవైపు కొత్తగా ఓసీపీ-5లో ప్రారంభం కావడం, ఇంకా ఆధునిక యంత్రాలు వినియోగించడం, మరోవైపు జీఎం కల్వల నారాయణ నిరంతర పర్యవేక్షణ, అధికారులు, కార్మికుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. గడువుకు ముందే లక్ష్యాన్ని ఛేదించడంతో కార్మిక, అధికారవర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
పెద్దపల్లి, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): సింగరేణి రామగుండం రీజియన్-1 (ఆర్జీ-1) గతంలో ఎన్నడూ లేనివిధంగా బొగ్గు ఉత్పత్తిలో రికార్డు సృష్టించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను నిర్దేశించుకున్న 39.20 లక్షల టన్నుల ఉత్పత్తిని 41 రోజుల ముందుగానే చేధించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని పెద్దకల్వల గ్రామానికి చెందిన కల్వల నారాయణ ఆర్జీ-1 డివిజన్ జీఎంగా పనిచేస్తుండగా, డివిజన్ బొగ్గు ఉత్పత్తిలో టాప్-1లో నిలవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. జీఎం నారాయణ బొగ్గు ఉత్పత్తి విషయంలో సింగరేణి అధికారులు, సిబ్బందిని, కార్మికులను నిరంతరం అప్రమత్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్జీ-1 లక్ష్యం 39.20లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా, ఈ నెల 18 నాటికే 39.24 లక్షల టన్నులు వెలికితీసింది. సింగరేణిలో వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధించిన డివిజన్‌గా మొదటి స్థానాన్ని దకించుకున్నది.
కలిసివచ్చిన ఓసీపీ-5, ఆధునిక యంత్రాలు
ఆర్జీ-1 పరిధిలో జీడీకే-1, 2, 2-ఎ, 11 గనులతోపాటు ఓసీపీ-5 ఉన్నాయి. ఓసీపీలో గతేడాది ఫిబ్రవరిలో కొత్తగా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించగా, అప్పటి నుంచి ఆర్జీ-1 ప్రాంతానికి బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌ను మరింత పెంచుతూ నిర్దేశించారు. జీడీకే-11 గనిలో రెండు కంటిన్యూస్మైనర్ యంత్రాలు పనిచేస్తుండగా, జీడీకే-1, 2, 2-ఎ గనుల్లో ఎసీఎల్, ఎల్‌హెచ్ యంత్రాల ద్వారా ఉత్పత్తి సాగుతున్నది. నాలుగు భూగర్భ బొగ్గుగనులు, ఒక ఉపరితల గని ద్వారా వార్షిక లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. సింగరేణి వ్యాప్తంగా 11డివిజన్లలో ఈ ఏడాది 70మిలియన్ టన్నుల లక్ష్యంగా నిర్దేశించారు. అందులో ఆర్జీ-1 నుంచి ఈ నెల 18 నాటికి 3.92 మిలియన్ టన్నుల (39.20లక్షల టన్నులు) బొగ్గును వెలికి తీశారు. దీంతో ఈ డివిజన్ సింగరేణి వ్యాప్తంగా టాప్-1లో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 40 రోజులు మిగిలి ఉండడంతో ఆర్జీ-1 అదనంగా మరో మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశమున్నది.
సమష్టి కృషితోనే సాధ్యమైంది..
వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు, కార్మికులు సమష్టిగా కృషి చేశారు. నిర్దేశించిన పనిని కార్మికులు శ్రద్ధతో చేయడంతోపాటు పాటు అధికారులకు అన్ని విధాలా సహకరిస్తూ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందువల్లే మంచి ఫలితం వచ్చింది. అన్ని సమస్యలను అధిగమిస్తూ ప్రారంభించిన ఓసీపీ-5 నుంచి సైతం బొగ్గు ఉత్పత్తి ఆశించిన స్థాయిలో రావడంతో లక్ష్యాన్ని ముందే చేరుకున్నాం. ఇది సమష్టి కృషి ఫలితం. తమ డివిజన్ టాప్-1లో నిలవడం చాలా ఆనందంగా ఉంది.
– కల్వల నారాయణ, ఆర్జీ-1 జీఎం (గోదావరిఖని)