కమాన్ చౌరస్తా ( కరీంనగర్) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల ( HCU Lands) వేలాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ ( BRSV) శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకురి మోహన్ ఆధ్వర్యంలో శాతవాహన విశ్వవిద్యాలయం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy) దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్సీయూ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని, విశ్వవిద్యాలయాల భూముల జోలికి వస్తే భారత రాష్ట్ర సమితి విద్యార్ధి నాయకులుగా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వం తన వైఖరినీ వీడకపోతే కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని, రోడ్లమీద తిరగనియ్యమని అన్నారు. ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు తీసుకున్నాక విద్యా విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే విశ్వవిద్యాలయాల భూములు అమ్మడమేనా అని ప్రశ్నించారు. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ( Indira Gandhi) 1973 లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని, ఈ యూనివర్సిటీని గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటారని వెల్లడించారు. ఇలాంటి భూములను బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టడం కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
విద్యార్ధుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేయాలని సూచించారు. కోర్టు సెలవులను చూసి బుల్డోజర్లతో హెచ్సీయూలోకి చొరబడి హంగామా చేయడం, అడ్డువచ్చిన విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం సరికాదన్నారు.
ఈ క్రమంలో విద్యార్థులపై నాన్ బెయిల్ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నారదాసు వసంతరావు, వోడ్నాల రాజు, బీఆర్ఎస్వీ ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షుడు నాయిని అన్వేష్, సీనియర్ నాయకులు బోడ ఆంజనేయులు, మామిడిపల్లి సాయి, శనిగరం సతీష్, సయ్యద్ సోహెల్, బద్దం ప్రవీణ్ రెడ్డి, నదీమ్ తదితరులు పాల్గొన్నారు.