Jeevan Reddy | సారంగాపూర్, జనవరి 7: ఎస్ఆర్ఎస్పీ కెనాల్‌కు మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలంలోని రేచపల్లి నుండి సారంగాపూర్ వెళ్లే ఎస్ఆర్ఎస్పీ కాలువ మధ్యలో మూడు రోజుల కింద కట్టతెగి పోవడంతో బుధవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంబందిత శాఖ అధికారులు, నాయకులతో కలిసి ఎస్ఆర్ఎస్పీ కాలువను పరిశీలించి వివరాలు తెల్సుకున్నారు.
ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో 12 ఎల్ నుండి రేచపల్లి నుండి సారంగాపూర్ వెళ్లే 11 ఆర్ ఎస్ఆర్ఎస్పీ కాలువ నుండి నీరు రావడంతో కాలువ కట్టతెగి పొలాల్లోకి నీరు వృదాగా పోతుంది. ఈ కాలువ ద్వారా సారంగాపూర్ మీదుగా బట్టపల్లి, పోతారం వరకు పంట పోలాలకు సాగునీరు అందుతుంది.
కాలువకు గండి పడి నీరు వృదాగా పోవడంతో కాలువ నీరు విడుదల చేసిన సమయంలో నీరు చివరి గ్రామాల వరకు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి కాలువకు పడిన గండిని పూడ్చి చివరి వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధికారులు కోరగా మరమ్మత్తులు చేపడుతామని అధికారులు పేర్కోన్నారు.
జీవన్ రెడ్డి రైతులతో మాట్లాడి కాలువ మరమ్మత్తులు పూర్తి చేసి చివరికి నీరందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎస్పీ డీఈ చక్రునాయక్, నాయకులు మోత్కురి ప్రసాద్డ్, చేకూట శేఖర్, మల్యాల శ్రీనివాస్, రామడుగు రవి, బాస మల్లయ్య, ఆశాది రాజన్న, హరీష్, ఆయా గ్రామాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.