Karimnagar Revenue Club | కలెక్టరేట్, ఏప్రిల్ 02 : నగరం నడిబొడ్డున గల రెవెన్యూ క్లబ్ అధీనంలోని దుకాణాల సముదాయం సీజింగ్ వ్యవహారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్లబ్ ఆధీనంలోని దుకాణాలకు సంబందించి అస్థిపన్ను చెల్లించకపోవడంతో బల్దియా యంత్రాంగం మూడు రోజాల క్రితం సీజ్ చేసింది. ఇప్పటివరకు సంబంధిత బకాయి చెల్లింపులు చేయకపోవటంతో వాటిలో అద్దెకుండి వ్యాపారాల నిర్వహిస్తున్న వారంతా అందోళన చెందుతున్నారు. రూ.80 లక్షలకు పైగా ఆస్తి పన్ను బకాయిపడటంతో, పూర్తిగా వెల్లిస్తేనే సీజింగ్ తొలగిస్తామంటూ మున్సిపల్ అధికారులు స్పష్టం చేస్తుండగా, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చెల్లింపులు చేసేది ఎలా అని క్లబ్ కార్యవర్గం తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
కలెక్టరేటుకు ఎదురుగా ఉన్న ఈ దుకాణాల సముదాయం రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభించి, వివిధ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు గదులు అద్దెకిస్తున్నారు. నాటి మంచి నేటి వరకు నయాపైసా కూడా మున్సిపాలిటీకి ఆస్తి పన్ను రూపేణా చెల్లించలేదని సమాచారం. ప్రస్తుతం అమొత్తం చెల్లించాల్సిందేనంటూ బల్దియా పట్టుబడుతుండగా, ఒక్కో మడిగెకు రూ. 64 వేల నుంచి రూ. 86 వేల పైచిలుకు మొత్తం చెల్లించాల్సి ఉన్నట్లు మున్సిపల్ అధికారుల ద్వారా తెలుస్తోంది. క్లబ్ అధీనంలోని దుకాణాల సముదాయంలో 30కి పైగా గదులు, వీటిపైన 2వేల చదరపు ఫీట్లకు పైగా మరో భవనం, రెవెన్యూ గార్డెన్, మరికొంత ఖాళీ స్థలం ఉండగా, ఇందులో వాషింగ్ సెంటర్ నడుస్తోంది.
వీటన్నిటికి మున్సివల్ యంత్రాంగం నిర్ణయించిన ప్రకారం గత నెల 31లోగా ఐతే రూ. 30,85,850 చెల్లించాలని గడువు విదించారు. అయితే, ఎలాంటి స్పందన లేకపోవటంతో సీజ్ చేసినట్లు మున్సిపల్ యంత్రాంగం పేర్కొంటున్నది. ఈ మొత్తం చెల్లించేందుకు క్లబ్ ఖాతాలో డబ్బులు లేకపోవటంతో గడువులోగా చెల్లించలేక నిస్సహాయంగా ఉన్నట్లు క్లబ్ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. గడువు ముగిసిన అనంతరం. రూ.80,93,067 చెల్లించాలని, ఈమొత్తం చెల్లించేదాక సిజింగ్ తొలగించేది లేదంటూ సంబంధిత యంత్రాంగం స్పష్టం చేస్తుండగా, సముదాయంలోని గదులకు టెండర్ వేయటమా? లేక ప్రస్తుతమున్న అద్దెదారులనుంచి అడ్యాన్స్ రూపేణా తీసుకుని బకాయి తీర్చటమా అనే మీమాంసలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంతకు క్లబ్ ఆదాయమేమవుతున్నట్లు?
రెవెన్యూ క్లబ్ అధీనంలో 20 పైగా అద్దె గదులు, రెవెన్యూ గార్డెన్ పేర ఓ ఫంక్షన్ హాలు, ఖాళీ ప్రదేశం, అద్దె గదులపైన రెండు వేల చదరపు పీట్లకు పైగా భవనం ఉన్నది. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న గదులకు రూ. 7వేలు, రెవెన్యూ క్లబ్ వైపు గదులకు రూ. రూ.65 వందల చొప్పున నెలవారీ అద్దె రెవెన్యూ క్లబ్ వస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం గదుల ద్వారా రూ.2.25 లక్షల వరకు ఆదాయం సమకూరుతుండగా, ఒకలో అంతస్థులోని భవనం, రెవెన్యూ గార్డెన్, ఖాళీ స్థలంలో కొనసాగుతున్న సర్వీసింగ్ సెంటర్ ద్వారా వచ్చే ఆదాయం అదనం.
వీటన్నిటి ద్వారా మొత్తంగా సగటున నెలకు రూ 3 లక్షల దాకా ఆదాయ వస్తున్నట్లు క్లబ్ సభ్యులే లెక్కలేసి చెబుతున్నారు. ఏడాదికి కనీసం రూ.36 లక్షలు అవుతుంది. ఆరంభంలో తక్కువ మొత్తంలోనే ఆదాయమున్నా, ఇరవై ఏళ్ళ క్రితం నాటి నుంచి నేటి వరకు అన్ని ఖర్చులు పోను, రూ. 5 కోట్లకు పైగానే నికర ఆదాయముండాల్సి ఉండగా, ఆస్తి పన్ను కూడా చెల్లించని స్థితికి చేరటంపై ఆ శాఖలోని కింది స్థాయి ఉద్యోగులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. క్లబ్ కార్యవర్గం ఎప్పటికప్పుడు మారుతున్నా వచ్చే ఆదాయ, వ్యయాలపై ఏ మాత్రం దృష్టి సారించకపోవటంతో నెలనెలా వచ్చే ఆదాయాన్ని ఎవరికి వారే అన్నట్టుగా హాంఫట్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికయ్యే కార్యవర్గం ప్రతి ఆర్థిక సంవత్సరంలో క్లబ్ లావాదేవీలపై అడిట్ చేంబంచాల్సి ఉండగా, ఎన్నడూ ఆదిశగా ఆలోచించనే లేదనే విమర్శలు వస్తున్నాయి.
దీంతో, ప్రతి నెల క్రమం తప్పకుండా లక్షల్లో వచ్చే ఆదాయం ఎటు మళ్ళిందనే అనుమానాలు సభ్యుల్లో వ్యక్తమవుతున్నాయి. సామాన్యుడు నల్లా పన్ను చెల్లించకపోతేనే మంచినీళ్ళ సరఫరా బంద్ చేసే మున్సిపల్ అధికారులు కలెక్టరేట్ ఎదురుగా గల దుకాణాల సముదాయానికి సంబంధించిన అస్థిపన్ను ఇన్నేళ్ళ నుంచి చెల్లించకున్నా ఎందుకు మౌనం వహించారనేది అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న. రెండు దశాబ్దాల నుంచి చెల్లించకుండా తాత్సారం చేస్తున్నా, చూసి చూడనట్లు ఉండటం వెనుక అంతర్యమేంటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు కూడా ముక్కు పిండి వసూలు చేసిన సందర్భాలు అనేకం ఉండగా, ఈ సముదాయానికి చెందిన బకాయిలపై నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై అందరిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అస్థిపన్ను వసూళ్లపై కొద్ది మాసాల క్రితమే కమిషనర్గా వచ్చిన ఐఎఎస్ అధికారి చాహత్ బాజ్పాయి ప్రత్యేక దృష్టి సారించటంతో బకాయి ఉదంతం వెలుగులోకి వచ్చింది. రూ. 80లక్షలకు పైగా రెవెన్యూ క్లబ్ సముదాయాల నుంచి మండింగ్ ఉండటాన్ని అమెు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ చైర్మన్ ఉన్న రెవెన్యూ క్లబ్ నిర్వహణ, క్లబ్ కు ఉన్న ఆస్థుల ద్వారా వస్తున్న ఆదాయ వ్యయాలపై సరైన లెక్కలు లేకపోవటం పట్ల అన్ని వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. దీనిపై కలెక్టర్ దృష్టి సారించి లోతుగా విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని రెవెన్యూ వర్గాలే పేర్కొంటుండటం కొసమెరుపు. కాగా, దీనిపై సంబంధిత బాధ్యులను వివరణ కోరగా, నిరాకరించారు.