Ramagundam | కోల్ సిటీ, జూన్ 11: రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్లుగా పునర్విభజన చేసిన క్రమంలో బుధవారం రామగుండం నగర పాలక సంస్థ వార్డుల విభజన ప్రత్యేక అధికారిగా నియమితులైన వరంగల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ సమీక్ష జరిపారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయంను సందర్శించగా డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ జే అరుణ శ్రీతో ఆయన భేటీ అయ్యారు.
డివిజన్ల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నగర ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్న అభ్యంతరాలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. శాస్త్రీయ పద్ధతిలో విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన పలు సూచనలు జారీ చేశారు. డివిజన్ల విభజన, చుట్టు ప్రక్కల గ్రామాల విలీనం, వార్డుల పరిశీలన తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యల గురించి అదనపు కలెక్టర్ అరుణ శ్రీ వివరించారు. ఇందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, పట్టణ ప్రణాళిక విభాగం, రెవిన్యూ విభాగం అధికారులతో సమావేశమై వార్డుల విభజన ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. టౌన్ ప్లానింగ్ రూపొందించిన డివిజన్ మ్యాప్ లను పరిశీలించారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఈఈ రామన్, టీపీఓ నవీన్, ఆర్ ఓ అంజనేయులు, ఆర్ ఐ శంకర్ రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.