గన్నేరువరం, ఆగస్టు 21 : కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచి 33 నెలలు కావొస్తున్నా మానకొండూర్ నియోజకవర్గంలో చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు. గెలిచిన వంద రోజుల్లో గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూర్ వరకు డబుల్ రోడ్ పూర్తి చేయిస్తానని చెప్పిన ఆయన, ఇంత వరకు ఎందుకు రోడ్డు వేయించలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు రోడ్డు వేయించాలని, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్నేరువరం నుంచి గుండ్లపల్లి వరకు మహా పాదయాత్ర చేపట్టారు. పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రసమయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కవ్వంపల్లి మాయమాటలతో అధికారంలోకి వచ్చాడని, కమీషన్ల కోసం కక్కుర్తి పడడమే తప్పా కంకర తేలిన రోడ్లవైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శించారు. రోడ్డు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే తాను మాత్రం కార్లలో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం కకుర్తి పడకుండా ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రూ.71కోట్లు మంజూరు చేయించి డబుల్ రోడ్డు పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, కాళేశ్వరం నీళ్లతో సస్యశ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. కవ్వంపల్లి నీవు గెలిచిన తర్వాత ఏం చేసినవో చెప్పాలని ప్రశ్నించారు.
డబుల్ రోడ్డు పనులు పూర్తి చేయాలని యువజన సంఘాల నాయకులు అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నెల రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. నియోజకవర్గంలో ప్రతి రోడ్డుపై పాదయాత్ర చేసి రోడ్లు వేయిస్తానని ఆయన గతంలో మాటిచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా రోడ్లు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.
నాడు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన అభివృద్ధి పనులకు నేడు కొబ్బరికాయలు కొడుతూ ప్రారంభిస్తున్నారే తప్పా కొత్తగా చేసిన అభివృద్ధి ఏమి లేదని ఎద్దేవా చేశారు. డబుల్ రోడ్డు అనేది ప్రజలకు సంబంధించినదని, బీఆర్ఎస్ ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత శ్రేణులు కవ్వంపల్లి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రలో నాయకులు సిద్ధం వేణు, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ జడ్పీటీసీలు మాడుగుల రవీందర్ రెడ్డి, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మండల నాయకులు విక్రమ్ రెడ్డి, గూడేల్లి ఆంజనేయులు, అటికం శ్రీనివాస్, పీచు మహేందర్ రెడ్డి, బద్దం తిరుపతి రెడ్డి, తీగల మోహన్ రెడ్డి, పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, గూడూరి సురేశ్, రవి, వంశీకృష్ణారెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.