MLA MS Raj Thakur | కోల్ సిటీ, జూలై 16: గోదావరిఖనిలో వచ్చే ఏడాది జనవరిలో రూ.15 కోట్ల నిధులతో కళాభవన్ ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. ఈమేరకు గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్య ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసి విన్నంచినట్లు తెలిపారు.
గత మే నెలలో గోదావరిఖనిలో కళా సంఘాల సమాఖ్య తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన గోదావరిఖని కళోత్సవాలకు సంబంధించిన చిత్రమాలిక ఫొటో ఫ్రేమ్ ను ఎమ్మెల్యేకు బుధవారం అందజేశారు. కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా ఉన్న గోదావరిఖనిలో కళాకారుల విన్నపం మేరకు కళాభవన్ నిర్మాణానికి తప్పకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి పనులకు బడ్జెట్ కేటాయించడం జరిగిందని, వచ్చే సంవత్సరం తప్పకుండా కళాభవనకు నిధులు కేటాయించి 28వ డివిజన్ హనుమాన్ నగర్ సర్వే నం.690లోని పాత అంగడి బడి స్థలంలో ఆధునిక హంగులతో నిర్మించి అందజేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అనంతరం ఆయనకు కళాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి మాదరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సోగాల వెంకటి. సలహాదారు కాసిపాక రాజమౌళి, ప్రచార కార్యదర్శి నాగుల శ్రీనివాస్, వీరేందర్ తోపాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తానిపరి గోపాల్ రావు, సినీ అభిమాన సంఘాల ఐక్య వేదిక జిల్లా చైర్మన్ గుండేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.