Ramagundam | కోల్ సిటీ, సెప్టెంబర్ 22 : రామగుండం నగర పాలక సంస్థ రెండవ కౌన్సిల్ ఎజెండా తప్పుల తడకగా ప్రతిపాదించి మరో ఘనత దక్కించుకుంది. గత ఆరు నెలలుగా కౌన్సిల్ సమావేశాల నిర్వహణ లేక సభ్యులు, ప్రజల నుంచి అపవాదులను ఎదుర్కొంటోంది. ఎట్టకేలకు 25న కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం శ్రమించి 26 అంశాలతో ఎజెండా రూపకల్పన చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ, ఇది ప్రజోపయోగంగా లేదనీ, జేబులు నింపుకోవాలనే చాకచక్యంగా తయారైందని పలువురు కార్పొరేటర్లు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఎజెండా ను పరిశీలించిన సభ్యులకు అనేక సందేహాలు తలెత్తుతండగా, వాటిలో 26వ అంశం ఒకటి తికమకపెడుతోంది. వేసవి కార్యాచరణ ప్రణాళిక-2024లో భాగంగా ఏఎండీ పథకం కింద ప్రభుత్వం రూ.60లక్షలు మంజూరు చేసింది. నాడు వేసవి కాలంలో పనులు ఆలస్యమైనందున నీటి సరఫరా నిర్వహణకు కేటాయించిన ఆ నిధులను రద్దు చేసింది.
ఇప్పుడు ఆ పనుల బిల్లులు చెల్లించేందుకు సీడీఎంఏకు నివేదికలు పంపించగా, ఒక్కసారి నిధులు రద్దయ్యాక తిరిగి చెల్లించడం ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదని సీడీఎంఏ తేల్చి చెప్పింది. ఐతే ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఆ నిధులు రద్దు కావడానికి గల కారణాలను ప్రక్కనబెట్టి, సదరు ఏజెన్సీ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయన్న నెపంతో ఆ పనులకు ప్రత్యమ్నాయంగా 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించేందుకు సిద్ధమైంది. అందుకు కౌన్సిల్ సమావేశంలో పరిపాలన ఆమోదం కోసం ప్రతిపాదనలు తయారు చేశారు. రామగుండం కార్పొరేషన్ లో ఘనత వహించిన ఇంజనీర్లు, అధికారులు, పాలకులు ఉండగా, లీకేజీలు, అంతర్గత కుళాయిల కనెక్షన్లకు రూ.10లక్షల అంచనాలకు గానూ ఏకంగా రూ.4,03,19,19 చెల్లించాలని ప్రతిపాదించారు. స్పష్టత కొరవడి ఇక్కడే సభ్యులకు సందిగ్ధత మొదలైంది. రూ.10లక్షల అంచనాకు రూ.40లక్షల లేక రూ.4 కోట్లా..? అన్నది తేల్చుకోలేకపోతున్నామని చెబుతున్నారు. ఇది అక్షర దోషమా..? లేక అంకెల గారడీనా.. అన్నది రేపటి కౌన్సిల్ సమావేశంలో సభ్యులు అడిగే ప్రశ్నకు అధికార పక్షం సమాధానం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే.