శిల్పకళా వైభవం
సుమారు ఆరు శతాబ్దాలుగా శిల్పకళపై ఉపాధి పొందుతూనే తరాల సంపదను కాపాడుతున్నారు రామడుగు శిల్పకళాకారులు. ఇక్కడి గడికోట నిర్మాణంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి వలస వచ్చి స్థిరపడిన కుటుంబాలుగా పూర్వీకులు చెబుతుంటారు.
- ‘చెక్కు’చెదరని రామడుగు శిల్ప సంపద
- దేశ విదేశాలకు విగ్రహాల ఎగుమతులు
- శతాబ్దాలుగా కొనసాగుతున్న వారసత్వానికి ప్రతీక
- ఇతర కులస్తులకు జీవనాధారమవుతున్న వృత్తి
“శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు” అని ఓ సినీ గేయ రచయిత అలనాటి శిల్పకళా వైభవాన్ని చాటి చెప్పారు. మొక్కవోని దీక్షతో శిలను శిల్పంగా మలిచి.. ప్రపంచానికి అందించేందుకు రామడుగు శిల్పులు తరాలుగా తపిస్తూనే కళను చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు. కరీంనగర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే రామడుగు మండలకేంద్రంలోకి అడుగు పెట్టగానే రహదారికి ఇరువైపులా ఉన్న కేంద్రాల్లో తమ కళకు జీవం పోసేందుకు క్షణం తీరికలేకుండా గడుపుతున్న కళాకారులు కనిపిస్తారు.
సుమారు ఆరు శతాబ్దాలుగా శిల్పకళపై ఉపాధి పొందుతూనే తరాల సంపదను కాపాడుతున్నారు రామడుగు శిల్పకళాకారులు. ఇక్కడి గడికోట నిర్మాణంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి వలస వచ్చి స్థిరపడిన కుటుంబాలుగా పూర్వీకులు చెబుతుంటారు. ఇక్కడి శిల్ప సంపదను రక్షించేందుకు గ్రామానికి చెందిన కళాకారుడు శెకల్ల హరిహరా చారి నేతృత్వంలో శిల్ప కళా నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా కేవలం శిల్పకళా (కాశి)కులానికి చెందినవారే కాకుండా స్థానికంగా ఉండే అన్ని కులాలవారూ తర్ఫీదు పొంది శిల్పాలు చెక్కుతూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
– రామడుగు, ఏప్రిల్ 1

శిల్పకళా శిక్షణలో తర్ఫీదు పొందుతున్న యువకులు
శిల్పాలు చెక్కేందుకు అమృత శిలలను ఉపయోగిస్తున్నారు. ముడి సరుకు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేట, ఐతుపల్లి నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. అత్యంత పూరాతన చరిత్ర కలిగిన రామడుగు శిల్పాలను కొనుగోలు చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, బోధన్, నిర్మల్, మెదక్, హైదరాబాద్, కర్నాటక రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి వస్తుంటారు. అమ్మవారి విగ్రహాలతోపాటు, గణపతి, నవగ్రహాలు, ఆంజనేయస్వామి, శివలింగాలు, శ్రీరామచంద్ర స్వామి విగ్రహాలను ఎక్కువగా తీసుకెళ్తుంటారు. మార్కెట్లో ఏ విగ్రహాలకు ఆదరణ ఉంటుందో వాటినే ఎక్కువగా చెక్కుతుంటారు. శివాలయాలు, వైష్ణవాలయాల్లో ఇక్కడి విగ్రహాలకు అధికంగా గిరాకీ ఉంటుంది.
సహాయకుడిగా పని చేస్తున్నా
పుట్టుకతోనే నేను దివ్యాంగుడిని. మా(గీత) కులవృత్తి చేసే శక్తిలేక చాలా ఏండ్ల నుంచే శిల్పకళలో సహాయకుడిగా పనిచేస్తున్నా. రామడుగు శిల్పకళకు చాలా ఏండ్ల చరిత్ర ఉంది. గతంలో కేవలం పంచకర్మల్లో ఒకరైన కాశి(శిల్పి) కులానికి చెందినవారు మాత్రమే శిల్పాలను చెక్కేవారు. ప్రస్తుతం సమాజంలోని అన్ని కులాలకు చెందినవారిని స్థానికంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చి పనిలో పెట్టుకుంటున్నారు. మొదట్లో నాకు రోజు కూలి 40 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు రోజుకు 400 రూపాయలు సంపాదిస్తున్నా. శిల్పాన్ని చెక్కేముందు కళాకారుడు బొమ్మను గీసిస్తే దాన్ని చెక్కుతుంటా. ఒక్కో విగ్రహం సైజును బట్టి రెండు నుంచి ఇరవై రోజుల వరకు పని చేయాల్సి ఉంటుంది.
– బత్తిని అంజయ్య, శిల్పకళా సహాయకుడు, రామడుగు
మూడు దశాబ్దాలుగా చెక్కుతున్నా
వంశపారంపర్యంగా వచ్చిన శిల్పకళా వృత్తిలో నేను మూడు దశాబ్దాలుగా పని చేస్తున్నా. ప్రస్తుతం ఇక్కడి శిల్పకళాకారులకు ఆదరాభిమానం కొంచెంకొంచెం తగ్గుతూ వస్తున్నది. 30 ఏండ్ల క్రితం ఇక్కడ సుమారు 80 కుటుంబాలు శిల్పకళ మీద ఆధారపడి జీవించారు. బతుకుదెరువు తగ్గడంతో కొన్ని కుటుంబాలు ఉపాధికోసం ఇతరవృత్తులవైపు మళ్లిపోతున్నారు. కొంతమంది ఉద్యోగాలు, మరికొంతమంది కూలి పనులు చేసుకుంటున్నారు. శిల్పాలకు ఉపయోగించే శిలల కొనుగోలు, పనిముట్ల ఖర్చులు రోజురోజుకూ పెరుగుతుండడంతో కళాఖండానికి సరైన గిట్టుబాటు ధర, ప్రోత్సాహం అందడంలేదు. మా తరంతోనే ఈ కళ ముగిసిపోతుందనే భయం మాలో ఉన్నది.
– శెకల్ల హరిహరాచారి, శిల్పకళాకారుడు, రామడుగు
శిల్ప కళే ఆధారం
మా తాతలు, తండ్రుల నుంచి కులవృత్తిగా తీసుకొని శిల్పకళ మీదే ఆధారపడి జీవిస్తున్నాం. నేను 15 ఏండ్ల నుంచి శిల్పాలు చెక్కుతున్నా. ప్రస్తుతం ఓంకారేశ్వర శిల్పకళా మందిరం ఏర్పాటు చేసి విగ్రహాలను చెక్కుతున్నాం. మా కళామందిరంలో సుమారు ఐదుగురు కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నాం. మేం చెక్కిన శిల్పాలు కేవలం తెలంగాణ రాష్ర్టానికే పరిమితం కాకుండా ఇతర రాష్ర్టాలతోపాటు దేశ, విదేశాలకు వెళ్తున్నాయి. కులవృత్తిని వదిలి వేరే పనులు చేయాలంటే మనస్సు అంగీకరించడం లేదు. వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని సాదుకుంట వృత్తిని కాపాడుతున్నాం. ముందస్తు ఆర్డర్ తీసుకొని శిల్పాన్ని అందిస్తుంటాం. శిల్పం పూర్తయిన తరువాత నవమాసాలు మోసిన తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టుగా ఉంటుంది.
– శెకల్ల రామానుజాచారి, శిల్పి, రామడుగు
శిల్ప కళకు నిలయం రామడుగు
నేను కులవృత్తి మీదే ఆధారపడి నా కుటుంబాన్ని పోషిస్తున్నా. మా తండ్రి శ్రీనివాసాచారి సుమారు 50 ఏండ్లు శిల్పాలు చెక్కారు. రామడుగు మండల కేంద్రం శిల్పకళకు నిలయం. గతంలో ఇక్కడ అనేక కుటుంబాలు శిల్పకళమీదే ఆధారపడి బతికేవి. నేను 20 ఏండ్లుగా శిల్పాలను చెక్కుతూ విక్రయిస్తున్నా. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముఖద్వారం ముందు పెట్టిన గాంధీ విగ్రహం నేను చెక్కినదే. ముఖ్యంగా శివ పంచాయతనం విగ్రహాలు ఎక్కుగా విక్రయిస్తుంటాం.వీటితో పాటు నవగ్రహాలు తీసుకెళ్తంటారు.
– పెందోట రాజుకుమార్చారి, శిల్పి, రామడుగు
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Anjaneyaswamy
- Bodhan
- Kashi
- medak
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

