వేములవాడ టౌన్, జనవరి29 : రాజన్న ఆలయంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. వేములవాడ రాజన్న ఆలయ ఓపెన్స్లాబ్పై కలెక్టర్ అధ్యక్షతన శనివారం సాయంత్రం మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ శాఖల అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలన్నారు. బస్టాండ్, పార్కింగ్ స్థలాలు, ఆలయ పరిసరాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పారామెడికల్ సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, అంబులెన్స్ వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఆలయ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
మిషన్ భగీరథ ద్వారా భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. భక్తుల రద్దీ ఉన్న రూట్లలో అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని, కొవిడ్ నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచాలని ఆదేశించారు. కంట్రోల్ రూముల వద్ద ప్రజా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి అనౌన్స్మెంట్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. పోలీస్ శాఖ సహకారంతో అన్ని పార్కింగ్ స్థలాల వద్ద వాహనాల రాకపోకలకు వేర్వేరుగా దారులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ, పోలీస్ బందోబస్తుకు సంబంధించి లా అండ్ ఆర్డర్ నిర్వహణ, ఆలయం లోపల, పరిసర ప్రాంతాలు, అనుబంధ దేవాలయవద్ద, భక్తులు విడిది చేసే ప్రాంతాల్లో రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపడుతామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకునేలా చూస్తామన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఖిమ్యానాయక్, బీ సత్యప్రసాద్, ఆలయ ఈవో ఎల్ రమాదేవి, వేములవాడ ఆర్డీవో వీ లీల, డీఎస్పీ చంద్రకాంత్, సీఐ వెంకటేశ్, ఆలయ ఈఈ రాజేశ్, ఏఈవోలు హరికిషన్, జయకుమారి, శ్రీనివాస్, నవీన్, ఆలయ ఎలక్ట్రికల్ ఏఈ ద్వారక శేఖర్, సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.