ఎల్లారెడ్డిపేట : బడిలో ఒకే టీచర్ ఉండటంతో మరో టీచర్ కావాలని మూడు రోజుల క్రితం కిష్టూ నాయక్ తండాలో ‘బడికి తాళం వేసి నిరసన’ తెలిపారు. అందుకు సంబంధించిన కథనం నమస్తే తెలంగాణలో ప్రచురితమైంది. టీచర్ లేకపోవడంతో విద్యార్థుల చదువు ప్రశ్నార్థకమైందని తండా వాసులు ఆవేదన వ్యక్తంచేశారు.
పాఠశాలలో ఉన్న ఒకే ఒక్క టీచర్ సౌమ్య తమ బంధునొకరు మృతిచెందగా సెలవు పెట్టి వెళ్లింది. దాంతో పాఠశాలలో విద్యార్థులను పర్యవేక్షించేందుకు ఎవరూ లేరు. అదే స్కూల్లోని అంగన్వాడీ పాఠశాలకు వచ్చిన ఓ తల్లి పిల్లలను చూసుకుంది. అనంతరం మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు వచ్చి చూసుకునే పరిస్థితి వచ్చింది.
బడిలో మరో టీచర్ లేక, అంగన్వాడీ బడి లేక తండాలోని పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుందని కిష్టూనాయక్ తండా వాసులు అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా పాఠశాలకు మరో టీచర్ను కేటాయించాలని కోరుతున్నారు.