గంభీరావుపేట జనవరి 14 : పండుగ పూట విషాదం నెలకొంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్ పూర్ (ఎం) వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కామారెడ్డి – సిరిసిల్ల ప్రధాన రహదారిపై మాచారెడ్డి ఎక్స్ రోడ్ గజ్యానాయక్ తండాకు చెందిన భూక్యా రాము (35) సముద్రలింగాపూర్ గ్రామానికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న సిద్దిపేట డిపోకు చెందిన (ఏపీ 29జెడ్ 1975) నెంబర్ గల బస్సు స్కూటీ ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో రాము అక్కడికక్కడే మృతి చెందినట్లు మాచారెడ్డి ఎస్ఐ కె. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మృతుడు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపల్లి ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య కళావతి, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి సర్కార్ దవాఖానకు తరలించారు. ఇదిలా ఉండగా సంఘటన జరిగిన సమాచారం తెలిసిన తండావాసులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కలచివేశాయి.