యాదాద్రి తర్వాత పనులు ప్రారంభం
స్వరాష్ట్రంలోనే ఆలయాలకు పునర్వైభవం…
వందశాతం దళితబంధు విజయవంతమవుతుంది
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
వేములవాడ, కోనరావుపేటలో పర్యటన
భీమేశ్వరసదన్ వసతి సముదాయం ప్రారంభం
పాల్గొన్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు
వేములవాడ/కోనరావుపేట, ఆగస్టు 11: వేములవాడ రాజన్న క్షేత్రాన్ని కోట్లాది రూపాయల నిధులను కేటాయించి గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. యదాద్రి నిర్మాణం పూర్తయ్యాక వేములవాడలో పనులు ప్రారంభమవుతాయని మంత్రి చెప్పారు. బుధవారం కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామంలో రూ.60లక్షలతో చేపట్టిన శ్రీ కోదండరామస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వేములవాడ రాజన్న ఆలయ సమీపంలో రూ. 10 కోట్లతో 60 గదులతో నిర్మించిన భీమేశ్వరసదన్ వసతి సముదాయ భవనాన్ని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఆలయాలకు పునర్వైభవం సంతరించుకున్నదని మంత్రి పేర్కొన్నారు. రూ.1200 కోట్లతో యాదాద్రి పనులు జరుగుతున్నాయన్నారు. కృష్ణశిలలతో తెలంగాణ తిరుపతిగా యాదాద్రి తెలంగాణలోనే గొప్ప చరిత్ర కలిగిన ఆలయంగా రూపుదిద్దుకుంటున్నదన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. యాదాద్రి తర్వాత రాజన్న ఆలయానికే భక్తులు ఎక్కువగా వస్తుంటారన్నారు.
ఇప్పటికే ఆలయ అభివృద్ధి కోసం 30ఎకరాల భూమిని కూడా సేకరించామని, బడ్జెట్లో కూడా అదనంగా రూ. 50కోట్లను కేటాయించామన్నారు. శృంగేరి పీఠం ఇచ్చిన అనుమతితో అభివృద్ధిని పూర్తిస్థాయిలో చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలంగా మారిందన్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి రైతులకు దిగుబడికి కూడా పెరిగిందన్నారు. మల్కపేట రిజర్వాయర్ పూర్తయిన తర్వాత గోదావరి జిల్లాల మాదిరిగా కోనరావుపేట మండలం మారబోతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను ధనవంతులుగా మార్చేందుకు తీసుకువచ్చిన దళితబంధు పథకం పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందన్నారు. ఎమ్మె ల్యే రమేశ్‌బాబు మాట్లాడుతూ నాగారం గ్రామా న్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. భూ పోరాటల గడ్డగా పేరున్న కోనరావుపేట నుంచి ఎన్నో ఉద్యమాలు ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయన్నారు.
భూస్వామ్య కుటుంబమైనప్పటికీ సాయుధ రైతాంగ పోరాటం ఆనాడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు నడిపినట్లుగా ఆయ న గుర్తు చేశారు. మల్కపేటతో కోనరావుపట సస్యశ్యామలమవుతుందని, దీనికి సీఎం కేసీఆర్, కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. నాగారానికి మరో రూ. 40లక్షలను కేటాయించి పర్యాటక కేంద్రంగా మార్చుతామన్నారు. వేములవాడ పట్టణంతోపాటు రాజన్న క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ. 280 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. అభివృద్ధి పనులు కొంత ఆలస్యమైనా వంద సంవత్సరాల వరకు ఉండేలా పూర్తిస్థాయిలో చేస్తామని చెప్పారు. రాజన్న ఆల య అభివృద్ధిపై త్వరలోనే మంత్రు లు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, అధికారులతో కలి సి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రమేశ్‌బాబు తెలిపారు. జరగాల్సిన అభివృద్ధి పను లు, రావాల్సిన నిధులపై పూర్తిస్థా యి చర్చ జరగనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో సిద్ధం కావాలని అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి అధికారులను ఆదేశించారు.
రాజన్న సన్నిధిలో పూజలు
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో మంత్రికి ఆర్చకులు ఘనస్వాగతం పలికారు. కోడెమొక్కు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అద్దాల మండపంలో మంత్రికి రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేయగా వేద పండితులు ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురా లు న్యాలకొండ అరుణ, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి, జిల్లా ఇన్చార్జి డీఎఫ్‌వో రవిప్రసాద్, రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్, వీటీడీఏ వైస్ చైర్మన్ ముద్దసాని పురుషోత్తంరెడ్డి, కార్యదర్శి భుజంగరావు, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్‌రావు, మిషన్ భగీరథ ఎస్ఈ రవీందర్, తహసీల్దార్ మునీందర్, రాజన్న ఆల య ఈఈ రాజేశ్, డీఈలు రఘునందన్, రామేశ్వర్రావు, ప్రశాంత్‌కుమార్, ఏఈవోలు సంకెపల్లి హరికిషన్, ప్రతాప నవీన్, జయకుమారి, బ్రహ్మన్నగారి శ్రీనివాస్ పాల్గొన్నారు.