రుణమాఫీ కోసం రైతులు రణం సాగిస్తున్నారు. మూడు విడుతల్లోనూ మాఫీ కాకపోవడంపై భగ్గుమంటున్నారు. మొన్నటిదాకా మొదటి, రెండో, మూడో విడుత అని చెప్పి.. ఇప్పుడు మళ్లీ దాటవేసే ప్రయత్నం చేస్తుండడంపై ఆగ్రహిస్తున్నారు. శనివారం ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ఆందోళనకు దిగారు. బ్యాంకులకు చేరుకుని.. తమకెందుకు మాఫీ కాలేదని అధికారులు, సిబ్బందిని నిలదీశారు. బ్యాంకుల ఎదుట ధర్నాలకు దిగారు.
రోడ్లపైకి చేరుకుని రాస్తారోకోలు చేశారు. అన్ని రకాలుగా అర్హత ఉన్నా మూడు విడుతల్లో తమ పేరు రాలేదని ఆవేదన చెందారు. రుణమాఫీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు నిర్వహించిందని, ఏనాడూ ఇటువంటి ఫిర్యాదులు రాలేదని గుర్తుచేశారు. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలతో మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కూడా మాఫీ కాని రైతులకు స్పష్టత ఇవ్వకుండా తిప్పుకుంటున్నదని ఆవేదన చెందారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. చాలాచోట్ల రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు సైలెంట్‌గా జారుకున్నారు.
మొలంగూర్ బ్యాంకు ముట్టడి
శంకరపట్నం, ఆగస్టు 17 : శంకరపట్నం మండలం మొలంగూర్ ఇండియన్ బ్యాంకు నుంచి 14 గ్రామాలకు చెందిన 1400 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. అందులో ఇప్పటివరకు మూడు విడుతల్లో కలిపి 311 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకా 987 మందికి రుణమాఫీ కాలేదు. అందులోనూ కన్నాపూర్, గద్దపాక, మొలంగూర్, ఆముదాలపల్లి గ్రామాల్లో 20 శాతం మంది కూడా కాలేదు. దీంతో ఆగ్రహించిన ఆ 14 గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు శనివారం మొలంగూర్ ఇండియన్ బ్యాంకును ముట్టడించారు.
తమకెందుకు రుణమాఫీ కాలేదంటూ బ్యాంక్ మేనేజర్‌తో వాగ్వాదానికి దిగారు. సహనం కోల్పోయి ఓ దశలో బ్యాంక్ షట్టర్ మూసి, బ్యాంక్ ఎదుట ధర్నా చేపట్టారు. ‘బ్యాంక్ మేనేజర్ డౌన్ డౌన్.. మేనేజర్‌ను సస్పెండ్ చేయాలి. అధికారులు సమాధానం చెప్పాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని బ్యాంక్ మేనేజర్ హామీ ఇచ్చినా వినిపించుకోలేదు. 20 రోజులుగా బ్యాంక్ సిబ్బంది ఇదే మాట చెప్పారని, అయినా తమకు మాఫీ కాలేదని వాపోయారు.
అనంతరం మొలంగూర్ క్రాస్ రోడ్డు కరీంనగర్-వరంగల్ రహదారిపై జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరిగే దాకా ఇక్కన్నుంచి కదిలేది లేదని భీష్మించారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా కదలలేదు. అధికారులు హామీ ఇచ్చేదాకా కదలబోమని తేల్చి చెప్పారు. దీంతో వెంటనే ఏవో వచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఏవోను వెంట బెట్టుకొని తిరిగి ఇండియన్ బ్యాంక్ వద్దకు వెళ్లారు. అక్కడ మరోసారి మేనేజర్‌తో మాట్లాడి స్పష్టమైన హామీ ఇవ్వడంతో శాంతించి వెనుదిరిగారు.
నికురం లేని మాటలు చెప్తున్రు
నేను పోయినేడు పెట్టుబడి కోసం ఇండియన్ బ్యాంక్‌ల 90 వేలు తీసుకున్నం. కండ్లు కాయలు కాసేలా చూస్తన్నం. బ్యాంకులకు పోయి అడిగితే రెండో విడుత అన్నరు. మళ్లా అడిగితే మూడో విడుతల వస్తది పోండ్రి అన్నరు. తీరా చూస్తే మీ పేరే లేదు అన్నరు. నికురం లేని మాటలు చెప్పవట్టిరి. మరి ఏంజెయ్యాలె. ఎవలను అడగాలె. అధికారులకు రైతులంటే లోకువ ఉన్నది. గట్టిగ అడిగితే మెడలు పట్టి నూకుతన్రు.
– మేడుదుల తిరుపతి, నల్లవెంకయ్యపల్లె (శంకరపట్నం)
ఈ సర్కారు ఫెయిల్
నేను మొలంగూర్ ఇండియన్ బ్యాంకుల లక్షా యాభై వేలు అప్పు తీసుకున్న. మాఫీ అన్నరు కానీ, అందరికీ కాలే. తిరిగీ తిరిగి కాళ్లరిగినయ్. రుణమాఫీల ఈ సర్కారు ఫెయిల్ అయింది. మొలంగూర్ ఇండియన్ బ్యాంక్‌ల ఒక్క 90 శాతం మందికి అప్పు మాఫీ కాలే. మరి ఈ సర్కారు ఎవరికి మాఫీ చేసినట్టు? బ్యాంకోళ్లను, అధికారులను ఎవ్వలను అడిగినా అందరూ తప్పించుకునుడే. ఇయ్యాలటి మాటలు అధికారులు ఎంతవరకు నిలబెట్టుకుంటరో చూస్తం. మాకు మాఫీ అయ్యేదాకా ఇడువం. బ్యాంక్ ముందు రోజూ వచ్చి కూర్చుంటం.
– ఇరుమల్ల మాధవరెడ్డి, కాచాపూర్ (శంకరపట్నం)
ఎవరు బాధ్యత వహిస్తరు?
మాకు మా ఊరి శివారుల రెండెకురాల భూమి ఉన్నది. పోయినేడు 1.25 లక్షలు అప్పు తీసుకున్న. రెండో విడుతల మాఫీ కాలేదని పోయి మేనేజర్‌ను అడిగిన. నీకు మూడో విడుతల గ్యారెంటీగా మాఫీ అయితదిపో అన్నడు. తర్వాత ఎందుకైనా మంచిది ఓసారి ఏవోను కూడా కలువు అన్నడు. ఆధార్ కార్డు పట్టుకొని నాతో పాటు 20 మందిమి అక్కడికి పోయినం. ఏవో ఆఫీసుల జాబితాల మా పేర్లే లేవన్నరు. బ్యాంకోళ్లు మీ పేర్ల లిస్ట్ పంపలేదని చెప్పిన్రు. ఇప్పుడు నేను ఎవలను అడగాలె. అధికారులు బాధ్యత వహిస్తరా..? లేక ప్రభుత్వం న్యాయం చేస్తదా..? ఎవరి బాధ్యత వహిస్తరు?
– పొద్దుటూరి భాస్కర్‌రెడ్డి, నల్లవెంకయ్యపల్లి (శంకరపట్నం)
ఆసిఫ్‌నగర్‌లో ఆందోళన
కొత్తపల్లి, ఆగస్టు 17 : కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ గ్రామంలోని ఇండియన్ బ్యాంకు శాఖలో ఆరు గ్రామాలు అంటే.. ఆసిఫ్‌నగర్, కమాన్‌పూర్, ఎలగందుల, బద్దిపల్లి, కాజీపూర్, నాగుల మల్యాల గ్రామాలకు చెందిన 1280 మంది రైతులు రుణం తీసుకున్నారు. మూడు విడుతల్లో 432 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకా 848 మందికి మాఫీ కావాల్సి ఉన్నది. దీంతో ఆయా గ్రామాల రైతులు ఆగ్రహించారు. బ్యాంకు షటర్ మూసేసి ఆందోళన చేశారు. రేషన్‌కార్డు ఉన్నా లిస్ట్‌లో పేరు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దేశానికి అన్నంపెట్టే రైతాంగాన్ని మోసం చేస్తే ఊరుకునేది లేదని, సీఎం రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు.
40వేలు కూడా మాఫీ కాలే
నేను ఏడాది కిందట ఆసిఫ్‌నగర్ ఇండియన్ బ్యాంకుల 30వేల పంట రుణం తీసుకున్న. మొదటి విడుత రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. అధికారులను అడిగితే మళ్లోతాప అత్తదన్నరు. మొన్న ఇచ్చిన లిస్ట్‌ల కూడా నా పేరు లేదు. బ్యాంక్‌కు వచ్చి చూసుకుంటే లోన్ డబ్బులు జమకాలేదని చెప్పిన్రు. ప్రభుత్వం రైతులకు ఆశచూపి మోసం చేయడం ఎంత వరకు కరెక్ట్.
– బుర్ర రాములు, కొండాపూర్ (కొత్తపల్లి)
అంతా గందరగోళం
ప్రభుత్వం చేసిన రుణమాఫీ అంతా గందరగోళంగా ఉన్నది. నాకు 80వేల రుణం ఉన్నా మాఫీ కాలె. బ్యాంక్ అధికారులు, వ్యవసాయ అధికారులు మాకేం తెలియదు అంటున్నరు. ప్రభుత్వం చేస్తే అందరికీ చేయాలె. లేకుంటే లేదు. కనీ ఇట్ల గోస పెట్టవద్దు.
– గాండ్ల రాజు, కొండాపూర్ (కొత్తపల్లి)
వేంపేటలో ధర్నా
మెట్పల్లి రూరల్, ఆగస్టు 17 : వేంపేట కెనరా బ్యాంకు శాఖ పరిధిలో 2వేల మంది రుణాలు తీసుకున్నారు. అందులో మెట్పల్లి మండలం వేంపేట, చింతలపేట, మల్లాపూర్ మండలం సాతారం, ధర్మారం, చిట్టపూర్ గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. మొత్తం 1021 మందికి రుణమాఫీ జరగగా.. ఇంకా 979 మందికి ఇంకా కావాల్సి ఉన్నది. దీంతో రుణమాఫీకాని రైతులు ఆగ్రహించారు. వందలాదిగా తరలివచ్చి వేంపేట కెనరా బ్యాం కు ఎదుట ధర్నాకు చేశారు. పాసుబుక్కులను చూపుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏవోకు వినతిపత్రం సమర్పించారు.
రేషన్‌కార్డు ఉన్నా మాఫీ కాలే
నాకు నాలుగెకరాల భూమి ఉన్నది. 2022లో వేంపేట కెనరా బ్యాంకులో 1.99 లక్షల పంట రుణం తీసుకున్న. గడువుకు ముందే రెన్యువల్ కూడా చేసిన. ప్రభుత్వం మొన్న విడుదల చేసిన 2 లక్షల మాఫీ జాబితాలో నా పేరు లేదు. నాకు తెల్ల రేషన్ కార్డు ఉన్నది. బ్యాంకు మేనేజర్, వ్యవసాయాధికారులను అడిగితే తెలియదంటూ దాటవేస్తున్నరు.
– మారు నరేందర్‌రెడ్డి, వేంపేట (మెట్పల్లి)
రుణమాఫీ లిస్ట్‌ల పేరులేదు
నేను 2019లో వేంపేట కెనరా బ్యాంకులో 1.50 లక్షల పంట అప్పు తీసుకున్న. దీనికి వడ్డీ 10 వేలు కలుపుకొని 1.60 లక్షలు రుణ బకాయి ఉన్నది. ఎన్నికల ముంగట కాంగ్రెస్ రుణమాఫీ ప్రకటిస్తే సంబురపడ్డ. కానీ, ప్రభుత్వం మొన్న విడుదల చేసిన లిస్ట్‌లో నా పేరు రాలేదు. మేనేజర్‌ను అడిగితే నాకేం తెలియదు. వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లమంటున్నడు.
– గోపిడి మధు, చింతలపేట (మెట్పల్లి)
ప్రభుత్వం మాటతప్పింది
నాకున్న ఐదెకరాల భూమిపై వేంపేట కెనరా బ్యాంకులో 1.40 లక్షల లోన్ తీసుకున్న. ప్రభుత్వం రెండో విడుతలో 1.50 లక్షల లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పింది. కానీ, రెండుసార్లు విడుదల చేసిన జాబితాలో నా పేరు లేదు. రేషన్‌కార్డు కూడా ఉన్నది. కానీ మాఫీ ఎందుకు కాలేదో ఎవరూ చెప్పడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది.
– భైరి లక్ష్మీనర్సయ్య, వేంపేట (మెట్పల్లి )