సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 25: తన కూతురుని వేధించిన బద్దెనపల్లికి చెందిన నలుగురు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రియాంక తండ్రి రాజేశం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు కొదాది మల్లేశ్‌బాబు, గుగ్గిల్ల శ్రీకాంత్‌గౌడ్, అభిగౌడ్, రాజు వేధింపులతోనే తన కూతురు మనోవేదన చెంది ఇంట్లో నుంచి వెళ్లిపోతే తిరిగి తీసుకువచ్చామని గురువారం ఎస్పీని కలిసి, సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సిరిసిల్ల పోలీసుల సూచన మేరకు శుక్రవారం తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ రామ్మోహన్‌ను కలిశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమ కూతురును వేధించినవారిపై ఫిర్యాదు చేశామని, పోలీసులు విచారణ చేస్తున్నారన్నారు. తాము ఎఫ్ఐఆర్ కాఫీ తీసుకోవడానికి తంగళ్లపల్లి ఠాణాకు వచ్చినట్లు చెప్పారు. తమ కూతురు విషయంలో ఎస్పీతోపాటు పోలీసులు సహకరించారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వివరించారు. మహిళ కార్యదర్శి అయిన తన కూతురిని వేధించడం హేయమైందని, ఇలా మరే అధికారికి జరుగవద్దన్నారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ప్రియాంక, జక్కుల యాదగిరి, కుటుంబసభ్యులు ఉన్నారు.