భారత స్వాతంత్య్ర 80వ దినోత్సవాల నిర్వహణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారికంగా నిర్వహించే పరేడ్ మైదానాలు, కలెక్టరేట్లు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రజాప్రతినిధులు, ప్రజలు వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా, కరీంనగర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జగిత్యాలలో మంత్రి అజారుద్దీన్, పెద్దపల్లిలో ప్రభుత్వ విప్ విజయరమణారావు, సిరిసిల్లలో విప్ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు.
వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, ప్రభుత్వ పథకాల ఉత్తర్వుల పంపిణీ చేసి వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్ల ప్రదర్శన చేయనున్నారు. మరోవైపు పట్టణాలు, మండలకేంద్రాలు, గ్రామాల్లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ పార్టీల ఆఫీసుల్లో మువ్వన్నెల జెండా ఎగురవేసేందుకు సిద్ధం చేశారు.