‘అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో..’ అన్నట్టున్నది రాష్ట్ర ఇంటర్‌బోర్డు తీరు! ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలన్నింటినీ ఒకేలా చూడాల్సిన బోర్డు, కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలకు ఓ రూల్.. సర్కార్ కాలేజీలకు మరో రూల్ అన్నట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. నిబంధనల అమలులో కార్పొరేట్ కాలేజీలకు తలొగ్గుతున్నదనే ఆరోపణలు వస్తుండగా, ఈ యేడాది ప్రాక్టికల్ పరీక్షల నేపథ్యంలో తీసుకున్న ఓ నిర్ణయం పూర్తిగా దాసోహం అనేలా ఉన్నట్టు తెలుస్తున్నది. ఏండ్లుగా కొనసాగుతున్న డిపార్ట్మెంట్ అధికారి (డీవో) పర్యవేక్షణ విధానాన్ని ఎత్తేసి, దీని స్థానంలో పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పింది. అయితే ప్రైవేట్‌లో అమలు చేయకున్నా చోద్యం చూస్తుండడంపై ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, విద్యార్థులు విమర్శిస్తున్నారు. బోర్డు కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలకు తలొగ్గ్గిందని, ప్రభుత్వ కాలేజీలను చావుదెబ్బ కొట్టిందని మండిపడుతున్నారు.
జగిత్యాల, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ స్థాయి నుంచే విద్యార్థుల్లో సబ్జెక్టులపై ప్రత్యక్షంగా, అవగాహన కల్పించేందుకు ప్రాక్టికల్స్‌ను ఏర్పాటు చేశారు. సెకండియర్ టైమ్ టేబుల్స్‌లో సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌కు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వానపాము, బొద్దింక, కప్ప, ఆకు అడ్డుకోత, ఉమ్మెత పువ్వుల కోత, భౌతిక, రసాయన శాస్ర్తాలకు సంబంధించిన సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. ఇది విద్యార్థులకు సబ్జెక్టుపై అవగాహన కలిగించేందుకు దోహదం చేసేది. అయితే కార్పొరేట్ జూనియర్ కాలేజీల స్థాపన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ప్రాక్టికల్స్ క్రమంగా కనుమరుగవుతూ వచ్చాయి. అవి కేవలం మార్కుల సాధనే ధ్యేయంగా పిల్లలను తయారు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చాయి. దీంతో కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ప్రాక్టికల్స్ టైంటేబుల్ లేకుండా పోయింది. కార్పొరేట్‌తోపాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ చిన్నచూపు ఏర్పడింది.
కీలకంగా ప్రాక్టికల్స్
ప్రాక్టికల్స్ చేయించడం తగ్గిపోయినా ప్రాక్టికల్ పరీక్షల ప్యాట్రన్ మాత్రం అలాగే కొనసాగుతూ వస్తున్నది. వెయ్యి మార్కుల్లో (రెండేండ్లకు కలిపి) ఎంపీసీ విద్యార్థులకు 60 మార్కులు, బైపీసీ విద్యార్థులకు 120 మార్కులు ప్రాక్టికల్స్ కేటాయించింది. విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరై, కనీసం 35 శాతం మార్కులు సాధిస్తేనే ఇంటర్మీమీడియెట్ పాస్ అవుతారన్న నిబంధన అమలులో ఉన్నది. ప్రతి విద్యా సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారం నుంచి మూడో వారం వరకు విడుతల వారీగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందుకోసం (ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో) కాలేజీలోని పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌ను నియమిస్తారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గురుకులాల నుంచి సీనియర్ లెక్చరర్లను డిపార్ట్మెంటల్ అధికారిగా, ప్రభుత్వ కాలేజీల్లోని సైన్స్ లెక్చరర్లను ఎగ్జామినర్స్‌గా నియమిస్తారు. ఎగ్జామినర్లు నిర్దేశిత కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇంటర్‌బోర్డు ఇచ్చిన ప్రాక్టికల్ ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు అందించి ప్రాక్టికల్స్ చేయిస్తారు. అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి, మార్కులు వేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ మొత్తం పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్ట్మెంట్ అధికారి పర్యవేక్షణలో జరుగుతుంది. అయితే ఇంటర్ థియరీ పరీక్షలను జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తుండగా, ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం సెల్ఫ్ సెంటర్లలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ విధానాన్ని మార్చాలని, ముఖ్యంగా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సెల్ఫ్ సెంటర్లలో నిర్వహించవద్దని, జంబ్లింగ్ పద్ధతి పాటించాలని, ప్రభుత్వ కాలేజీల్లో ప్రాక్టికల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా ఉన్నది. కొన్నేళ్ల క్రితం ఇంటర్ బోర్డు ప్రాక్టికల్స్ పరీక్షలను సైతం జంబ్లింగ్ పద్ధతిలో చేయాలని నిర్ణయించినా తర్వాత వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నది.
సీసీ కెమెరాలు తప్పనిసరి
ఇంటర్మీడియెట్ బోర్డు ఈ విద్యాసంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులను తెచ్చింది. 55 ఏండ్లుగా కొనసాగుతున్న డిపార్ట్మెంట్ అధికారి (డీవో) పర్యవేక్షణ విధానాన్ని ఎత్తివేసింది. దీని స్థానంలో ప్రాక్టికల్ పరీక్షలు సీసీ కెమెరాల ఆధీనంలో జరగాలని, సీసీ కెమెరాలను జిల్లాస్థాయిలో నోడల్ అధికారి, పరీక్షల నిర్వహణ బృందం (డిస్ట్రిక్ ఎగ్జామ్ కమిటీ) రాష్ట్రస్థాయి పరీక్షల బృందం, ఇంటర్‌బోర్డు కమిషనర్ సెల్ఫోన్లకు అనుసంధానించాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ప్రతి ల్యాబ్‌లో రెండు సీసీ కెమెరాలు, వరండాలో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. అలాగే టూవే ఆడియో ఇచ్చేందుకు కావాల్సిన డివైస్‌లను అమర్చుకోవాలి. అలాగే 10 మీటర్ల దూరంలో మాట్లాడే మాటలను సైతం రికార్డు చేసే సామర్థ్యం కలిగిన వాయిస్ కేబుల్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి పరీక్షా కేంద్రానికి 100 ఎంబీపీఎస్ సామర్థ్యంతో ఉన్న బ్రాడ్‌బాండ్ ఉండాలి. ఇలా అన్ని ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లోనూ ఉండాలని చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలతోపాటు గురుకులాల్లో ప్రాక్టికల్ నిర్వహించే ల్యాబ్‌ల్లో సీసీ కెమెరాలు, ఇతర ఎక్విప్మెంట్ను అమర్చింది.
తీవ్ర విమర్శలు
ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని సర్కారు కాలేజీలకు చెందిన ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు ఓ రూల్, ప్రభుత్వ కాలేజీలకు మరో రూల్ ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కేవలం సర్కారు కాలేజీ విద్యార్థులకు మాత్రమే నష్టం వాటిల్లుతుందని, కార్పొరేట్ వారికి ఎలాంటి ఇబ్బందులు రావని, పైగా వారి పరీక్షా కేంద్రాలపై ఎలాంటి నిఘా లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. ఈ నిర్ణయంతో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వ కాలేజీల రిజల్ట్స్ తీవ్రంగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో సైన్స్ విద్యార్థులు ప్రాక్టికల్ మార్కుల కోసం ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకుంటారని, సర్కార్ కాలేజీలు క్రమంగా మూతపడే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయమై మైనార్టీ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు.. ‘ఇది సరికాదు’ అంటూ ఇంటర్‌బోర్డు కమిషనర్‌కు నివేదించారు. ప్రాక్టికల్ పరీక్షల్లో కార్పొరేట్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ లేకుండానే..
ఇంటర్ బోర్డు ఆదేశాలు అందుకున్న ప్రైవేట్ కాలేజీలు కొన్నాళ్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పి మభ్యపెట్టాయి. తీరా పరీక్షలు సమీపించిన తరుణంలో సీసీ కెమెరాల ముందు పరీక్షలు నిర్వహించమని ప్రభుత్వంతో తేల్చిచెప్పాయి. ప్రాక్టికల్ ఇబ్బందులను తప్పించుకునేందుకు తమకు రీయింబర్స్మెంట్ రాలేదని, స్కాలర్షిప్లు రాలేదని, కాలేజీలు బంద్ చేస్తామని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. వ్యవహారం ఇలా నలుగుతున్న సమయంలోనే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 3వ తేదీన ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఒక్క సెల్ఫ్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రభుత్వ కాలేజీల్లో సీసీ కెమెరాల ముందు జరుగుతుండగా, ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ఎలాంటి పర్యవేక్షణ లేకుండానే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.