రవాణాశాఖకు సంబంధించిన కార్డులను పోస్టల్ శాఖ వినియోగదారులకు చేరవేస్తున్నది. అయితే ఆ శాఖకు కొన్ని నెలల బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్టీఏ పరిధిలోని సేవలకు బ్రేక్ పడింది. దీంతో లైసెన్స్, రిజిస్ట్రేషన్ కార్డులు రావడం లేదని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళన చెందుతున్నారు.
తిమ్మాపూర్, డిసెంబర్18: ఉమ్మడి కరీంనగర్ రవాణాశాఖ సేవలను కరీంనగర్ పోస్టల్ శాఖ నిర్వహిస్తున్నది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల ఆర్టీఏల్లోని కార్డులను కరీంనగర్ పోస్టల్‌శాఖ పంపుతుండగా, పెద్దపల్లితోపాటు హుజూరాబాద్‌కు సంబంధించి వరంగల్ పోస్టల్ శాఖ పంపిస్తున్నది. అయితే కరీంనగర్ పోస్టల్ పరిధిలో కొన్ని నెలలకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో కార్డుల పంపిణీకి బ్రేక్ పడింది.
ఇలాంటి సమస్యే రాష్ట్రవ్యాప్తంగా రావడంతో ఇటీవల జాయింట్ కమిషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. జనవరిలో బిల్లులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సేవలను పునరుద్ధరించారు. కానీ, కరీంనగర్ పోస్టల్ పరిధిలో మాత్రం పంపిణీ నిలిపివేశారు. 3 జిల్లాల్లో కనీసం మూడు వేల లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఇతర కార్డులు నిలిచిపోగా, రవాణా శాఖపై వినియోగదారులు మండిపడుతున్నారు. అధికారులు చొరవ తీసుకుని వెంటనే కార్డులు పంపిణీ జరిగేలా చూడాలని కోరుతున్నారు.
పోస్టల్‌శాఖకు సంబంధించిన బిల్లులు పెండింగ్ ఉన్నాయి. జనవరిలో చెల్లిస్తామని చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా సేవలు కొనసాగుతున్నా.. కరీంనగర్‌లోనే ఈ పరిస్థితి ఉన్నది. బిల్లులు హైదరాబాద్ నుంచే విడుదల చేయాలి. పోస్టల్ అధికారులతో మాట్లాడినా వారు వినడం లేదు. బిల్లులు చెల్లిస్తేనే పోస్టు చేస్తమంటున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలిపాం.
– పురుషోత్తం, డీటీసీ (ఉమ్మడి కరీంనగర్)