కొత్తపల్లి, జనవరి 28 : రాష్ట్రస్థాయి పోలీసుల క్రీడాపోటీలకు కరీంనగర్ వేదికైంది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 మంగళవారం ప్రారంభమైంది. సాయంత్రం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోరాటాల గడ్డపై రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు జరగడం అనందంగా ఉందన్నారు. 29 క్రీడాంశాల్లో జరిగే పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 20 జోన్ల నుంచి సుమారు 2,380 మంది క్రీడాకారులు, అందులో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటుండడం సంతోషంగా ఉందన్నారు. ఆలిండియా పోటీల్లో 26 బంగారు, 79 రజత, 102 కాంస్య పతకాలు సాధించారని గుర్తు చేశారు.
క్రీడా పోటీల్లో భాగంగా ‘ఉరుకుల.. ఉరుకుల ఉత్సాహం’ సీడీని ఆయన ప్రారంభించారు. అలాగే, పోటీలకు ఘనంగా ఏర్పాట్లు చేసిన పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతిని అభినందించారు. మల్టీ జోన్-1 ఐజీపీ ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగం అంటేనే ఒత్తిడితో ఉండేదని, ఇలాంటి పోటీలతో ఉపశమనం కలుగుతుందన్నారు. స్పోర్ట్స్ ఐజీపీ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి జరిగే పోటీల్లో పోలీస్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా క్లస్టర్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. అంతకుముందు క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేయగా అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి, రామగుండం సీపీ శ్రీనివాసులు, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, జగిత్యాల ఎస్పీ అశోక్, కరీంనగర్ రూరల్ ఎస్పీ శుభం ప్రకాశ్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినీరెడ్డి, ప్రొబెషనరీ ఐపీఎస్ వసుంధర, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్ తరహాలో మంగళవారం కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్-2025 పోటీల మార్చ్ఫాస్ట్ ఆకట్టుకున్నది. రాష్ట్రంలోని పోలీస్ శాఖకు చెందిన 20 జోన్లకు చెందిన 2,380 క్రీడాకారులు రంగు రంగుల క్రీడా దుస్తులతో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ జోన్‌కు చెందిన ప్లకార్డులు, కెప్టెన్ ఫ్లాగ్‌తో చేసిన మార్చ్ ఫాస్ట్ అలరించింది. తొలుత కాళేశ్వరం జోన్ జట్టు చివరగా ఆతిథ్య రాజన్న సిరిసిల్ల జోన్ మార్చ్ ఫాస్ట్ చేసింది.