Odela | ఓదెల, జులై 19 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో స్వర్ణకారుల కులస్తులు పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి స్వర్ణకార కులస్తులు ఓదెలకు తరలివచ్చి పోచమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆషాడ మాసం పురస్కరించుకొని స్వర్ణకారులు పోచమ్మ దేవత వద్ద ప్రత్యేక పూజలతో నైవేద్యం పెట్టి మొక్కలు చెల్లించుకున్నారు. పిల్లాపాపలతోపాటు పాడి, పంటలు చల్లంగా ఉండేలా చూడాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు.
మహిళలు బోనాలతో ఆలయం చుట్టూ తిరిగి పోచమ్మ తల్లికి నైవేద్యం చెల్లించారు. డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో స్వర్ణకారులు ఆలయానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఓదెల సర్పంచ్ కనికి రెడ్డి సతీష్, స్వర్ణకారుల సంఘం నాయకులు దేవరకొండ శ్రీనివాస్, వెలిసోజు శ్రీనివాస్, రవీంద్ర చారి, కొండపాక నరసింహ చారి, శ్రీధర్, దేవరకొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు.