ఓదెల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభంలో పాల్గొన్న రాష్ట్ర హైకోర్టు జడ్జిలు
Odela | ఓదెల, జూలై 13 : ఓదెల మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన జూనియర్ సివిల్ జడ్జ్ కం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును రాష్ట్ర హైకోర్టు జడ్జి, పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటీవ్ జడ్జి జస్టిస్ కే లక్ష్మణ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనమంతా కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర హైకోర్టు జడ్జిలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల, కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం తిరుపతి రెడ్డిలు స్వాగతం పలకగా, పండితులు వేదమంత్రాల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కోర్టును ప్రారంభించి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ రాష్ట్ర హై కోర్టు జడ్జీలు ఎన్.వి. శ్రావణ్ కుమార్, ఈవీ వేణు గోపాల్, జే శ్రీనివాస్, పలువురు న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, జిల్లాలోని పలు బార్ అసోసియేషన్ సభ్యులు, డీసీపీ కరుణాకర్, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ ధీరజ్ కుమార్, న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.