ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో అత్యవసర సాయానికి కరీం‘నగరం’లో ఏర్పాటు చేసిన డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) నిరుపయోగంగా మారింది. భారీ వర్షాలు, ఈదురుగాలులు వచ్చిన సందర్భాల్లో ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక సామగ్రితో స్పెషల్ టీంను నియమించగా, కొద్దిరోజులుగా కార్యాలయానికే పరిమితమవుతున్నది. నిర్వహణ, మరమ్మతులు లేక పరికరాలతోపాటు వాహనాలు మూలకు పడినట్టు తెలుస్తుండగా, ఇటీవల నగరంలో పలుచోట్ల వరదలతో ప్రజానీకం ఇబ్బందులు పడ్డా పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మున్ముందు భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వ్యవస్థను పటిష్టం చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
కార్పొరేషన్, ఆగస్టు 10: కరీం‘నగరం’లో వరద సమయాల్లో తక్షణ చర్యలు తీసుకోవడం, ప్రజలకు అత్యవసర సాయం అందించడమే లక్ష్యంగా మూడేళ్ల క్రితం డీఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెంటనే రంగంలోకి దిగేందుకు ఈ విభాగంలోని సిబ్బందికి అవసరమైన అన్నిరకాల సామగ్రిని అందించారు. ప్రత్యేకంగా యూనిఫాం, రెయిన్ కోట్స్, రాత్రిళ్లు ఉపయోగపడేలా పెద్ద టార్చ్లైట్లు, చెట్టు కటింగ్ చేసే యంత్రాలు, ఇనుము, ఇతర్రతా వాటిని కట్ చేసేందుకు ప్రత్యేకంగా కటింగ్ మిషన్, అన్ని విధాలుగా ఉపయోగించే నిచ్చెనతో పాటు ఇతర సామగ్రి, ఒక పెద్ద వాహనంతో పాటు, మరో రెండు వాహనాలను కొనుగోలు చేసి, అందజేశారు. అయితే డీఆర్ఎఫ్ కొన్నాళ్లుగా చేష్టలుడిగి చూస్తున్నదని, నామమాత్రంగా మారిందన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం ఈ విభాగం సిబ్బంది ఎవరూ యూనిఫాం వినియోగించడం లేదు. కేవలం రోడ్ల అక్రమణలు చేసే వారి సామగ్రిని తీసుకువచ్చి ముడుపులు తీసుకొని తిరిగి ఇచ్చే దందా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఉన్న వాహనాల్లో పెద్ద వాహనం ఏడాదిగా కార్యాలయానికే పరిమితం కాగా, ఉన్న రెండు వాహనాల్లో ఒక్కటి మరమ్మతులకు చేరి మూలకు పడింది. పారిశుధ్య విభాగంలో రెండు జేసీబీలు ఉండగా, ప్రస్తుతం మరమ్మతుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇంజినీరింగ్ విభాగం జేసీబీ సైతం మరమ్మతుల్లోనే ఉంది. నగరంలో ఎక్కడైనా భారీ వర్షం కురిస్తే అంతే సంగతులు అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇటీవల కురిసిన వర్షానికే ప్రధాన రహదారుల్లో వరద నిలిచి ప్రజలు అవస్థలు పడ్డా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. కాగా, వరద వచ్చిన టైంలో జేసీబీల అవసరం ఉండనుండగా, మరమ్మతులు చేయించడంలో ఇంజినీరింగ్ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. అద్దె వాహనాల వినియోగం జరిగితే కమీషన్లు వస్తాయన్న ఆలోచన వల్లే బల్దియాలోని వాహనాలను మరమ్మతులు చేయించడం లేదని పలువురు మాజీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఉన్నతాధికారులు డీఆర్ఎఫ్ బృందాలను పటిష్టం చేయాల్సినా అవరసం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.