అత్యంత ఘన చరిత్ర కలిగిన పెద్దాపూర్ గురుకులంలో ఇప్పుడు విద్యార్థులకు భరోసా కరువవుతున్నది. వరుస ఘటనలతో భయాందోళన వాతావరణం ఏర్పడింది. ఐదు నెలల క్రితం ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, మరో నలుగురు చావు అంచులదాకా వెళ్లడం కలకలం రేపింది. అప్పుడు పాముకాటు వల్లేననే అనుమానాలు వ్యక్తమైనా.. ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కారణాలను వెల్లడించలేదు. తాజాగా, మరో ఇద్దరు పాముకాటుతో అస్వస్థత చెందగా, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులంలో అసలేం జరుగుతోందని, పిల్లలను పంపిస్తున్నది చదివించడానికా.. లేక చంపుకోవడానికా.. అని ప్రశ్నిస్తున్నారు.
మెట్పల్లి రూరల్, డిసెంబర్ 19: మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యంత ఘనమైన చరిత్ర కలిగి ఉన్నది. 1983లో దీనిని ఏర్పాటు చేయగా, కాలగమనంలో జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ అయింది. ప్రస్తుతం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యాబోధన కొనసాగుతుండగా, ఈ విద్యాలయం 40 ఏండ్ల కాలంలో వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దింది. అలాంటి ఈ గురుకులంలో భయాందోళన పరిస్థితి నెలకొన్నది. గత జూలై 26న ఎనిమిదో తరగతి విద్యార్థి రాజారపు గణాధిత్య(13) మృతి చెందగా, అస్వస్థతకు గురైన మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స తర్వాత కోలుకున్నారు. ఆగస్టు 9న 6వ తరగతి విద్యార్థి ఎడ్మల అనిరుధ్(11)మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, విద్యార్థుల మృతికి, అస్వస్థతకు గల కారణాలపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. అప్పుడు పాముకాటు వల్లే పిల్లలు చనిపోయారనే అనుమానాలు వ్యక్తం కాగా, తాజాగా మరో ఇద్దరు విద్యార్థులు పాముకాటు బారిన పడడం కలకలం రేపింది.
మరో ఇద్దరికి పాముకాటు!
గురుకులంలో మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థత చెందారు. బుధవారం 8వ తరగతి విద్యార్థి ఓంకార్ అఖిల్, గురువారం 8వ తరగతి విద్యార్థి బోడ యశ్విత్ అస్వస్థతకు గురయ్యారు. అఖిల్‌కు కుడిచేతి మణికట్టుపై, యశ్విత్‌కు కుడి అరచేయి, కుడికాలిపై పాముకాట్లు గుర్తించారు. వీరిద్దరికీ కోరుట్లలోని వేర్వేరు ప్రైవేట్ దవాఖానల్లో యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఇద్దరు పిల్లలు కూడా ఒకే గదిలో నిద్రించిన సమయంలో పాముకాటుకు గురయ్యారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థుల వద్దకు డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరు విద్యార్థులు విషపురుగు కాటు వల్ల అస్వస్థతకు గురయ్యారని, వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.
ఘటనలు జరిగినప్పుడే..
అధికారులు ఏదైనా ఘటనలు జరిగితే గానీ తేరుకోవడం లేదు. జూలై, ఆగస్టులో ఇద్దరి ప్రాణాలు పోయినప్పుడు హడావుడి చేశారే గానీ, మళ్లీ దృష్టి పెట్టలేదు. అప్పుడు సెలవులు ప్రకటించి విద్యార్థులను ఇండ్లకు పంపించారు. యుద్ధ ప్రాతిపదికన ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించారు. పాడుబడిన బావులను పూడ్చి వేశారు. పాత భవన గదులను కూల్చివేశారు. ఆ సమయంలో పాములు బయటకు రాగా, చంపేశారు. ఆగస్టు 13న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల మరణాలు, అస్వస్థతకు గల కారణాలపై ఆరా తీసి, నూతన భవనాన్ని అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు పెండింగ్ పనులను పూర్తి చేసి నూతన భవనాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి పాఠశాల నూతన భవనంలో కొనసాగుతున్నా.. ఆ తర్వాత పారిశుధ్య పనులు, పిచ్చిమొక్కల తొలగింపును విస్మరించారు. దీంతో గురుకుల ప్రహరీని ఆనుకొని, నూతన భవనం వెనకాల పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి.
నిరుపయోగంగా ఉన్న స్నానాల గదులు, టాయిలెట్ల వద్ద కూడా పెరిగాయి. దీంతో పాముల సంచారం పెరిగినట్టు తెలుస్తుండగా, పది రోజుల క్రితం ఆవరణలో పాము కనిపించిందని విద్యార్థులు తెలిపారు. గత నెల 27న కిచెన్‌షెడ్‌లో ఎలుకలు సైతం బయటకు వచ్చాయి. తాజాగా, ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో పెద్దాపూర్ గురుకులాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఆవరణంతా కలియతిరుగుతూ పేరుకుపోయిన పిచ్చిమొక్కలను తొలగించాలని, గుంతలను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో చుట్టుపక్కల పంచాయతీల నుంచి ట్రాక్టర్లను తెప్పించి పారిశుధ్య సిబ్బందితో పిచ్చిమొక్కలను తొలగిస్తున్నారు. అయితే, ఏదైనా ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తున్నారని, ఆ తర్వాత నిర్లక్ష్యం చూపుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల ఆవరణను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వాపోయారు.
సస్పెన్షన్లతోనే సరి!
ఐదు నెలల క్రితం పిల్లలు మృతి చెందినప్పుడు అప్పటి ప్రిన్సిపాల్ విద్యాసాగర్‌ను సస్పెండ్ చేశారు. ఆహారంలో నాణ్యతలోపం, కిచెన్ షెడ్లో అపరిశుభ్రత కారణంగా గత నెల 26న ఫుడ్ ఇన్చార్జి కిశోర్‌ను కలెక్టర్ సత్యప్రసాద్ సస్పెండ్ చేశారు. తాజా, ఘటనలోనూ ప్రిన్సిపాల్ మాధవీలతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల అస్వస్థతపై ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం అందించకపోవడంతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వేటు వేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు సస్పెండ్ చేస్తూ చేతులు దులుపుకొంటున్నారని, తర్వాత గురుకులంలో విద్యార్థుల సమస్యలను గాలికొదిలేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
రాత్రి బసకు మంగళం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురుకులాన్ని సందర్శించిన సమయంలో ఆయన పలు ఆదేశాలు ఇచ్చారు. నెలలో ఒకసారి కలెక్టర్, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతోపాటు రాత్రి బస చేస్తారని ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి గానీ, ప్రజాప్రతినిధి గానీ ఇక్కడ బస చేసిన పాపానపోలేదు. దీనికి తోడు గురుకులంలోనే బస చేయాల్సిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు కూడా ఉండడం లేదు. కేవలం నైట్ కేర్టేకర్లు మాత్రమే రాత్రి బస చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహిస్తున్నారు. రాత్రి వేళ ఏదైనా జరిగినప్పుడు పిల్లలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఉంటున్నదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గురుకులాన్ని మరోచోటుకు తరలించండి
తల్లిదండ్రుల రాస్తారోకో
పెద్దాపూర్ గురుకులాన్ని మరో చోటుకు తరలించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విద్యార్థులు అస్వస్థత చెందిన విషయం తెలిసి గురువారం పెద్దాపూర్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గతంలో ఇద్దరు పిల్లల మృతికి, నలుగురు విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలను ఇప్పటికీ ఎందుకు వెల్లడించలేదని ఆర్డీవో శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మాధవీలతను నిలదీశారు. ప్రస్తుతం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థత చెందారని, దీనికి కారణాలను ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అనంతరం మారుతీనగర్ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకొని రాస్తారోకో చేశారు. ప్రమాదపుటంచున పిల్లల చదువులు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనింతటికీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. చివరకు అధికారులు వచ్చి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో సాయంత్రం రాస్తారోకో విరమించారు. కొందరు తమ పిల్లలను ఇండ్లకు తీసుకెళ్లారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఆందోళనకు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్
విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. కోరుట్లలోని ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న పెద్దాపూర్ గురుకుల విద్యార్థులు అఖిల్, యశ్విత్‌ను డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, డీఎస్పీ రాములుతో కలిసి గురువారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ చెప్పారు. ఇక్కడ కోరుట్ల, మెట్పల్లి సీఐలు సురేశ్‌బాబు, నిరంజన్‌రెడ్డి, ఎస్ఐలు శ్రీకాంత్, శ్యాంరాజ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఎందరిని బలి తీసుకుంటరు?
జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
జగిత్యాల, డిసెంబర్ 19 : గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా రేవంత్ సరార్ పట్టించుకోవడం లేదని, మొద్దు నిద్రలో ఉందని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మండిపడ్డారు. అసమర్థతతో.. నిర్లక్ష్యంతో ఇంకెంత మంది పిల్లలను బలి తీసుకుంటారని ప్రశ్నించారు. పెద్దాపూర్ గురుకుల సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్దాపూర్ గురుకులంలో ఇప్పటివరకు ఆరుగురు విద్యార్థులు పాముకాటుకు గురైనా ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదని వాపోయారు. పాముకాటుతో ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా.. ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి కొట్లాడుతారని స్పష్టం చేశారు.