పెద్దపల్లి, నవంబర్ 24(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పోలీసు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఇందులో అర్హత సాధించిన యువతీ యువకులు ఈవెంట్స్‌లో మెరిట్ సాధించడమే లక్ష్యంగా మైదానాల్లో నిత్యం కఠోరంగా శ్రమిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో గంటల తరబడి పరుగు, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంతో పాటు రామగుండం, మంథనిలోని క్రీడా మైదానాలు వందలాది మంది అభ్యర్థులతో ప్రతి రోజూ సందడిగా మారుతున్నాయి.
ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం
క్రీడా మైదానాల్లో ప్రాక్టీస్ చేస్తున్న యువతీ యువకులకు ప్రజాప్రతినిధులు, అధికారులు తమకు తోచిన విధంగా సహకరిస్తున్నారు. పోలీసు అధికారులు, రిటైర్డు పోలీసు, ఆర్మీ అధికారులు, పీఈటీలు విలువైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మంథనిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అభ్యర్థుల కోసం క్రీడా మైదానాన్ని చదును చేయించడంతోపాటు పిచ్చి మొక్కలను తొలగించి గుంతలు పూడ్చివేయించారు. మైదానం చుట్టూ తాత్కాలికంగా మొరంతో రన్నింగ్ ట్రాక్‌ను వేసి, దానిపై కాంక్రీట్ చిప్స్ వేయించారు. లైటింగ్ ఏర్పాటు చేయించారు. అభ్యర్థులందరికీ ఉచితంగా రన్నింగ్ షూ పంపిణీ చేయడంతో పాటు నెల రోజులుగా ప్రతి రోజూ పాలు, గుడ్లు, అరటి పండ్లు, రాగి జావ అందిస్తున్నారు. పెద్దపల్లి ఐటీఐ క్రీడా మైదానంలో అభ్యర్థులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మమతారెడ్డి ఆధ్వర్యంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. వాకింగ్, రన్నింగ్‌కు మైదానాన్ని శుభ్రం చేయించారు.
మహిళా అభ్యర్థులకు మరుగుదొడ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. మైదానం వద్ద మున్సిపల్ సిబ్బందిని సైతం ఏర్పాటు చేసి వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. రిటైర్డు ఆర్మీ దామోదర్ రాజు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. పెద్దపల్లి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాగునీరు, ఉడికించిన కోడి గుడ్లు, పల్లీ, పెసర్లు, శనగ మొలకలు అందిస్తున్నారు. గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి సేవా సంస్థ ఉచితంగా శిక్షణ అందిస్తున్నది. రన్నింగ్‌లో ప్రావీణ్యం ఉన్న ఈపీ ఆపరేటర్ పైడాకుల సంపత్, ఎస్అండ్పీసీ ఉద్యోగి మేదరవోయిన తిరుపతిని జీఎం కే నారాయణ అభ్యర్థులకు శిక్షకులుగా నియమించారు. అంతే కాకుండా అభ్యర్థులకు ప్రతీ రోజూ పౌష్ఠికాహారాన్ని సింగరేణి అందజేస్తున్నది. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించడంతోపాటు టీ షర్ట్స్, ట్రాక్ షూలను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అందిస్తున్నారు. అభ్యర్థులకు డైట్‌ను ఇప్పటికే అందజేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఫిజికల్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులంతా ఉచితంగా ఇచ్చే శిక్షణ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఉద్యోగాన్ని సాధించాలి. ప్రస్తుతం కొనసాగిస్తున్న కసరత్తు తమ జీవితంలో నిత్యం చేసుకుంటే మంచి ఆరోగ్యంతోపాటు సుఖమైన జీవితాన్ని పొందవచ్చు. నాకు శక్తి యుక్తులు సహకరించే వరకు పోలీస్, ఆర్మీలో ఉచిత శిక్షణ కొనసాగిస్తా. ఇప్పటికే నా శిక్షణలో 300 మంది వరకు ఉద్యోగాలను సాధించారు. వారి ఆసక్తి, నా సలహాలు, సూచనలతో లక్ష్యం చేరుకుంటున్నారు.
-దామోదర్ రాజు, రిటైర్డు ఆర్మీ అధికారి, పెద్దపల్లి
నాకున్న అనుభవాన్ని నేర్పిస్తున్నా
నేను సింగరేణిలో ఈపీ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. పరుగు పందెం క్రీడాకారుడిగా దాదాపు 25 కోలిండియా క్రీడా పోటీల్లో పాల్గొన్నా. నాకున్న అనుభవాన్ని మొత్తం పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న దాదాపు 180 మంది అభ్యర్థులకు నేర్పిస్తున్నా. జీఎం కే నారాయణ ఆదేశాల మేరకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి ప్రభావిత గ్రామాలు, సింగరేణి ఉద్యోగస్తుల పిల్లలకు శిక్షణ అందిస్తున్నా. అభ్యర్థులంతా చాలా ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది.
-పైడాకుల సంపత్, ఈపీ ఆపరేటర్, ఓసీపీ-5, ఆర్జీ-1, గోదావరిఖని
ప్రతీ అభ్యర్థి అర్హత సాధిస్తారు
నేను సింగరేణి సెక్యూరిటీ విభాగంలో పీఈటీ, డ్రిల్ ఇన్‌స్ట్రక్టర్‌గా కొనసాగుతున్నా. నాకున్న అనుభవాన్ని శిక్షణగా అందిస్తున్నా. ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ఫుట్పై శిక్షణ ఇస్తున్నాం. అభ్యర్థులకు కోడిగుడ్లు, పాలు, అరటి పండ్లను సింగరేణి అందిస్తున్నది. అభ్యర్థులంతా చాలా కష్ట పడుతున్నారు. మా దగ్గర శిక్షణ పొందే అభ్యర్థులు ఖచ్చితంగా ఈవెంట్స్‌లో అర్హత సాధిస్తారు.
-మేదరవోయిన తిరుపతి, ఎస్అండ్పీసీ, ఆర్జీ-1, గోదావరిఖని
చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం
పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించా. 25 రోజులుగా ప్రతీ రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాకు పాలు, గుడ్లు, అరటి పండ్లు వంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అంతే కాకుండా షూలను ఇస్తున్నారు. చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. కచ్చితంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధిస్తా. -కోరవేన శ్రీనివాస్, స్వర్ణపల్లి, మంథని
కానిస్టేబుల్ ఉద్యోగం సాధిస్తా
నేను గృహిణి. భర్త సహకారంతో పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా. మొదటి ప్రయత్నంలో ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యాను. తర్వాత నాకు ఇంకా నమ్మకం పెరిగింది. సింగరేణి ఆధ్వర్యంలో ఇస్తున్న ఈ ఉచిత కోచింగ్‌లో చాలా మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. కచ్చితంగా ఈవెంట్స్ లో క్వాలిఫై అయి ఉద్యోగం సాధిస్తా.
– రవళిక, గోదావరిఖని