హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమని వెళ్తే ఆ అధికారి డబ్బుల డిమాండ్
Demands Rs.10 lakh | కోల్ సిటీ, సెప్టెంబర్ 21: 20 యేళ్లుగా అనాథ పిల్లల ఆశ్రమం నడుపుతున్న మా ఆశ్రమంకు 10 గుంటల భూమి ఇవ్వమని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ తీసుకొని కలెక్టర్ ఆఫీసుకు వెళ్తే… అంత జాగ ఊరికే ఇస్తారా..? 10 లక్షలు తీసుకరాపో, అప్పుడే నీ పని చేయమని కలెక్టర్ చెప్పిండంటూ స్వయంగా డీడబ్ల్యువోనే లంచం అడిగండని, కాదని చెప్పమనండి.. లేదంటే అదే కలెక్టరేట్ ఎదుట తాను ముక్కు భూమికి రాస్తా..’ అంటూ గోదావరిఖని గాంధీనగర్ ఎం డి హెచ్ డబ్ల్యూఎస్ ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య ఆరోపించారు. గాంధీనగర్ బస్టాండ్ కు వెళ్లే రోడ్డు పై ఆశ్రమ పిల్లలతో కలిసి ఆదివారం ఆందోళనకు దిగారు.
జిల్లా ఉన్నతాధికారులే డబ్బులు అడిగితే ఇంక న్యాయం ఎక్కడుందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆశ్రమ పిల్లలు మోకాళ్లపై కూర్చొని.. అయ్యా కలెక్టర్ సారు.. మా భూమి మాకిమ్మని అంటూ దండాలు పెట్టారు. బస్తీవాసులు చేరుకొని ఇదెక్కడి పాపం అంటూ మద్దతుగా నిలిచారు. రాజయ్య మాట్లాడుతూ 2017లో అప్పటి కలెక్టర్ దేవసేన మా ఆశ్రమానికి వచ్చి ఇక్కడ బస్టాండ్ దారిలో సర్వే నం.706లోని 10 గుంటల భూమి ప్రభుత్వంకు అప్పగించాలని సింగరేణి సంస్థకు లేఖ రాసారనీ, ఆ స్థలం ఆశ్రమంకు ఇవ్వడానికి ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. దాంతో ఆ స్థలంలో తాము షెడ్డు నిర్మించుకుంటే సింగరేణి వాళ్లు వచ్చి ధ్వంసం చేసి తమకు ఆస్తి నష్టం కలిగించారనీ, దాంతో తాను న్యాయం కోసం హైకోర్టుకు వెళ్లాననీ, ఆశ్రమంకు 10గుంటల స్థలం వెంటనే ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని, గత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తప్పకుండా స్థలం ఇచ్చేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు.
ఆయన బదిలీతో ఆ ఫైలు కదలడం లేదనీ, రెండేళ్లుగా కలెక్టరేట్ చుట్టూ కాళ్ల చెప్పులు అరిగేలా తిరుగుతున్నాననీ, తాను వికలాంగుడినని కూడా చూడకుండా మనోభావాలు దెబ్బతినేలా డీడబ్ల్యువో వ్యంగ్యంగా మాట్లాడేవాడనీ, గత జూన్ లో మళ్లీ కలవగా, హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ కావాలంటే రూ.10లక్షలు కలెక్టర్ కు ఇవ్వాలని డీడబ్ల్యువోనే చెప్పాడనీ, లేదంటే కోర్టుకే వెళ్లి వాళ్లనే స్థలం ఇవ్వమని అడుక్కో అంటూ పంపించాడని వాపోయాడు. గతంలో కలెక్టరేట్ నుంచి అధికారులను పంపించి తమ ఆశ్రమంలోని పిల్లలను బలవంతంగా కారులో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకవెళ్లి రెండు రోజుల తర్వాత పంపించారనీ, ఇలా అధికారుల వేధింపులు తాళలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఈ విషయమై సీఎంతో పాటు ఢిల్లీలోని వికలాంగుల హక్కుల కమిషన్, రామగుండం పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం బస్తీ వాసుల జోక్యంతో ఆందోళన విరమించారు.