Godavarikhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 20 : రామగుండం నగర పాలక సంస్థ రెండో జనరల్ బాడీ సాధారణ సమావేశం నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఇంతకాలం ప్రజా సమస్యలు, ప్రొటోకాల్ వివాదం, అభివృద్ధి పనుల్లో అక్రమాల ఆరోపణలు, నిధుల కేటాయింపులు తదితర వివాదాల పరిష్కార వేదికగా కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కొద్ది నెలలుగా పట్టుబడుతున్న సభ్యుల ప్రయత్నం ఫలించింది. ఎట్టకేలకు ఈనెల 25వ తేదీన నగర పాలక కార్యాలయంలో రెండో కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి తేదీ ఖరారు చేసినట్లు నగర పాలక మేయర్ పేరిట 60 మంది సభ్యులకు ఎజెండా కాపీలతో కూడిన ఆహ్వానం అందింది. కాగా, అందులో 25 అంశాలతో ఎజెండా రూపకల్పన చేయగా, అది కూడా ప్రజోపయోగంగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్ల తర్వాత సమావేశం నిర్వహిస్తున్నారన్న సంతృప్తి కంటే, ఎజెండా అంశాలను పరిశీలించిన సభ్యుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎజెండా తయారీలో ప్రజాధనంను దుర్వినియోగానికే అధిక ప్రాధాన్యత కల్పించారన్న అభిప్రాయంను పలువురు సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో 25న జరిగే కౌన్సిల్ సమావేశం సవ్యంగా సాగుతుందా..? లేక రసాభాసగా మారుతుందా అన్న సందిగ్ధత నగర పాలక అధికారులు పాలక వర్గంలో ఉత్కంఠ అంశంగా మారింది. ఇదిలా ఉండగా, రాబోయే సద్దుల బతుకమ్మ సందర్భంగా 60 డివిజన్లలో అద్దె ప్రాతిపదికన ఫ్లడ్ లైట్ల ఏర్పాటుకు రూ.22 లక్షల బిల్లును ప్రవేశపెట్టడం పట్ల ఇప్పుడే సభ్యుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఎందుకంటే గత ఏడాది బతుకమ్మ ఏర్పాట్ల సందర్భంగా ఫ్లడ్ లైట్ల అద్దెకు రూ.16లక్షల బిల్లులు కేటాయించగా, ప్రస్తుతం రూ.22 లక్షలకు పెంచారు. ఈ లెక్కన చూసుకుంటే ప్రతీ ఏటా ఐదేళ్లలో రూ.కోటి వరకు ఖర్చు చేయనున్నారు. ఐతే ఏటా అద్దె ప్రాతిపదికన ప్రజాధనం దుర్వినియోగం చేయడం కంటే వాటినే కొనుగోలు చేస్తే సుమారు రూ.30లక్షలతో గిట్టుబాటవుతుందని సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. ఈవిషయమై కౌన్సిల్లో ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అలాగే నగర పాలక కార్యాలయం మరమ్మతులకు రూ.20 లక్షలు, 60 మంది కార్పొరేటర్లకు కొత్తగా స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు రూ.30లక్షలు కేటాయించారు. కొద్దీ నెలలుగా బల్దియాలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నిస్తున్న కార్పొరేటర్ లను మభ్యపెట్టడానికే ఒక్కొక్కరికి రూ.50వేల విలువైన మొబైల్ ఫోన్ల పథకం పెట్టారా అని పలువురు విమర్శిస్తున్నారు.
ప్రజోపయోగ్యమైన పనుల కంటే అధికారులకు పాలక వర్గంకు కమిషన్లు వచ్చే అంశాలపైనే అధిక దృష్టి సారించినట్లు వాపోతున్నారు. అలాగే స్థానిక నర్సరీని ఇన్నాళ్లు పట్టించుకోని పాలక వర్గం ఇప్పుడు వన మహోత్సవం పేరిట రూ.64 లక్షలు కేటాయించడం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికేనా అని ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలంలో డివిజన్లలో చేతిపంపుల నిర్మాణానికి నిధులు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2024లో కార్పొరేషన్ కు కేటాయించిన నిధులు లాప్స్ కాగా, అప్పుడు జరిగిన పనులకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సుమారు రూ.50 లక్షలు చెల్లించడానికి ఎజెండా రూపొందించారు. కానీ, ఆ నిధులు లాప్స్ కావడానికి అధికారుల తప్పిదమా, కాంట్రాక్టర్ల తప్పిదమా? అనే అంశంపై విచారణ జరగాలని సభ్యుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
జేబులు నింపుకోవడానికే ఈ ఎజెండా : మార్కపురి సూర్య, కార్పొరేటర్
కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు జేబులు నింపుకోవడానికే జాగ్రత్తగా ఏజెండాను తయారు చేశారు. ప్రజాధనంను దుర్వినియోగం చేసే విధంగా ఉంది. ఈ ఎజెండాను ఆమోదించేది లేదు. ఉచిత అంత్యక్రియలపై ఆలోచన లేకుండా ఉంది. ప్రజలు చెల్లించే పన్నులకు సార్థకత లభించేలా ఉండాలి. రూపాయికే అంత్యక్రియలు పునరుద్ధరించాలి. కాదని, ప్రజాధనంను దుర్వినియోగం చేస్తే పోరాటాలు తప్పవు.