కరీంనగర్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆకస్మిక బదిలీల్లో భాగంగా అక్టోబర్ 30న కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పమేలా సత్పతి అనతికాలంలోనే సమర్థవంతురాలైన అధికారిగా నిరూపించుకున్నారు. ఇక్కడ పనిచేసిన ఆరు నెలల కాలంలో ఎక్కువగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. తనకు లభించిన తక్కువ సమయంలో పాలన విషయంలో తనదైన ముద్ర వేశారు. జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలుపుగోలుగా ఉంటూనే విధి నిర్వహణలో మాత్రం కఠినంగానే వ్యవహరించారు. ప్రభుత్వ పరంగా వచ్చే ఆదేశాలను అమలు చేయించడంలో సక్సెస్ అయ్యారు. నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవల పార్లమెంట్ ఎన్నికలను ఆమె అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు.
ఎక్కడా చిన్న గొడవ జరుగకుండా ప్రశాంతంగా ముగించడంలో విజయవంతమయ్యారు. రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా ముందుకెళ్లారు. అధికారులతో కూడా అదే విధంగా పని చేయించారు. సమీక్షలు నిర్వహించడంలోనూ తనదైన శైలిని కనబర్చారు. ముఖ్యంగా మహిళా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలను తరచూ తనిఖీ చేసి పిల్లలు, గర్భిణులకు ప్రభుత్వ పరంగా అందుతున్న ప్రయోజనాలను ఎప్పటికప్పుడు సమీక్షించారు. పాఠశాలలను తరచూ తనిఖీ చేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమాన్ని తరచూ సమీక్షించి పనులను ముందుకు సాగించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం బదిలీపై వెళ్లిన పమేలా సత్పతికి ప్రస్తుతం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.