కరీంనగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : కరీంనగర్లో నకిలీ మందుల విక్రయాలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా వేణు మెడికల్ ఏజెన్సీ మేనేజింగ్ పాట్నర్ ఆర్ వేణుగోపాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఇలాంటి కేసులో మేనేజింగ్ పాట్నర్‌ను రిమాండ్ చేయడం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెడికల్ చరిత్రలోనే ఇదే తొలిసారి కాగా, రాష్ట్రంలో నాలుగోసారి జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
కాగా, సన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న లివిపిల్-500 మాత్రలు నకిలీవి విక్రయిస్తున్న కేసులో వేణుగోపాల్‌ను అరెస్ట్ చేయగా, కోర్టు అతడికి 12 రోజుల రిమాండ్ విధించినట్లు ఏడీ శ్రీనివాసులు తెలిపారు. గత వారం రోజులుగా కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న మెడికల్ దందాపై ‘నమస్తే తెలంగాణ’లో వరుసగా వస్తున్న కథనాలు అధికారుల్లో చలనం తెప్పించాయి. కథనాలకు ముందు వేణు ఏజెన్సీ విక్రయించిన నకిలీ మందుల్లోనూ ఫార్ములా ఉందని అధికారులు చెప్పగా, ఇదే విషయంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రచురిస్తున్న కథనాలు సంచలనం రేపాయి.