చిగురుమామిడి, సెప్టెంబర్ 28: చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాషబత్తిని ఓదెలు కుమార్ జెట్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఏప్రిల్ 2023లో స్థాపించబడిన జటాధార ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులు, పాఠశాలను అభివృద్ధి చెందిస్తున్న ఉపాధ్యాయులను సన్మానించారు.
ఓదెలు కుమార్ పాఠశాలలోని విద్యార్థులను సైన్స్ పట్ల ఆకర్షించే విధంగా పాఠ్యాంశాలను కృత్యాల ద్వారా ప్రయోగాలను లో కాస్ట్ -నో కాస్ట్ ద్వారా వివిధ సైన్స్ పోటీలలో విద్యార్థులను జిల్లా, రాష్ట్ర, స్థాయికి తీసుకెళ్లడంలోను, జిల్లాలోని ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణా తరగతులను అందిస్తున్నందుకు ఎంపిక చేసినట్లు జెట్ చైర్మన్, సభ్యులు ప్రకటించారు. 29న హరిహర కళాభవన్ సికింద్రాబాద్ లో సన్మానం చేస్తున్నట్లు అవార్డు గ్రహీత తెలిపారు. ఓదెలు కుమార్ ఎంపికైనందుకు జిల్లా విద్యాధికారి మొండయ్య, అశోక్ రెడ్డి, శ్రీనివాస్, సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, విద్యాధికారి పావని, పాఠశాలల ఉపాధ్యాయ బృందం ఓదెలు కుమార్ను అభినందించారు.