Dust Effect | కోల్ సిటీ, డిసెంబర్ 22 : గోదావరిఖని నగరంలోని మార్కండేయ కాలనీ ప్రధాన రోడ్డు డివైడర్ ను ఎక్కడికక్కడ తొలగిస్తున్నారు. స్థానిక అడ్డగుంటపల్లి నుంచి మొదలుకొని రాజేష్ థియేటర్ వరకు సుమారు 2 కి.మీ మేర ఉన్న డివైడర్ తో పాటు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను నగర పాలక అధికారులు సోమవారం నుంచి తొలగింపు పనులు చేపట్టారు. ఐతే ఎక్స్కవేటర్ తో దారి పొడవునా డివైడర్ ను కూల్చివేస్తుండగా విపరీతమైన దుమ్ము, ధూళి లేవడంతో స్థానికులు సతమతం అవుతున్నారు.
ప్రధాన రోడ్డులో వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఏలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్డు మధ్యలోని డివైడర్ ను, చెట్లను విద్యుత్ స్తంభాలను తొలగిస్తుండగా, దారి పొడవునా విపరీతమైన దుమ్ము ధూళి కమ్ముకోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ము లేవకుండా నగర పాలక సిబ్బంది కనీసం వాటర్ స్ప్రింక్లింగ్ చేపట్టడం లేదని వాపోతున్నారు.
దీనితో రోడ్డుపైనే గాకుండా ఇళ్లలోకి సైతం దుమ్ము, ధూళి విపరీతంగా వస్తుండటంతో స్థానికులు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న డివైడర్ ను తొలగించి మళ్లీ డివైడర్ నిర్మాణం చేపట్టడం కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నగర పాలక కమిషనర్ స్పందించి దుమ్ము, ధూళి లేవకుండా వాటర్ స్ప్రింక్లింగ్ చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.