Education | పెద్దపల్లి కమాన్, జులై 23 : భావి భారత పౌరులను తీర్చిదిద్దే పాఠశాలల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు.. వందల మంది విద్యార్థులు చదువుకునే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రం ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. విద్యార్థులకు ఎలాంటి రక్షణ కల్పించకుండా ప్రమాదకర గదుల్లో చదువులు చెప్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసౌకర్యాలు, అపరిశుభ్రంగా ఉన్న పాఠశాలల్లో అర్హత లేని టీచర్లతో భోదిస్తున్నారు. కాగా జిల్లాలో గత కొన్నేళ్లు గా పలు పాఠశాలలను అనుమతులు లేకుండా నడిపిస్తున్నా.. విద్యాశాఖధికారులు మాత్రం పర్యవేక్షించిన దాఖాలాలు లేవనే విమర్శలొస్తున్నాయి. జిల్లాలో మొత్తం సుమారు 90 వేల మంది విద్యార్థులు పాఠశాల విద్యానభ్యసిస్తున్నారు. ఇందులో 60 వేలకు పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల ల్లో చదువుకుంటున్నారు.
అయితే కొన్ని ప్రైవేట్ బడుల్లో అసౌకర్యాలు, అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలకు పాఠాలు బోధిస్తూ, వందల మంది విద్యార్థులున్నా కేవలం రెండు మూడు టాయిలెట్స్ తో కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో పిల్లలు అనారోగ్యాల భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని అనుమతులు లేని పాఠశాలల కు విద్యా సంవత్సరం ఆరంభంలో కాకుండా ఏడాది ముగిసే సమయంలో విద్యాశాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని పలువురు మండిపడుతున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ సెలవు దినాల్లో కూడా విద్యాబోదన చేస్తున్న ఎంఈఓ లు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలువురు మండిపడుతున్నారు. పెద్దపల్లిలో ని ఓ భవనంలో నిర్వహిస్తున్నా ప్రైవేట్ స్కూల్ ను నడిపించకూడని విద్యాశాఖ అధికారులు నోటీసులు అంటించినా, నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ విద్యా భోదన చేయడం అనుమానాలకు తావిస్తుంది. విద్యాహక్కు చట్టం – 2009 ప్రకారం నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అసౌకర్యాల చదువు.. అడ్డగోలు ఫీజులు
జిల్లా లో ని కొన్ని ప్రైవేట్ పాఠశాల ల భవనాలు ప్రమాదకరం గా ఉన్నాయి. కొన్నింటికి రక్షణ గోడలు లేకపోగా, ఆవరణలో అపరిశుభ్ర వాతావరణం, స్కూళ్ల ముందు డ్రైనేజీ లు ఉండి దుర్వాసన రావడం తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వందల మంది విద్యార్థులు రెండు, మూడు టాయిలెట్స్ తో నానా తంటాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వ నిబంధనలు పాటించని పలు విద్యా సంస్థల్లో మాత్రం విద్యార్థుల నుంచి అడ్డగోలు పీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
చర్యలు తీసుకోవాలి..
బండి రాజశేఖర్, ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్
జిల్లా లో నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. కొన్ని స్కూల్స్ లో సెలవు దినాల్లో కూడా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. పెద్దపల్లి లోని ఐడియల్ స్కూల్ నడపకూడని విద్యాశాఖ అధికారులు నోటీసులు అంటించినా, మళ్లీ విద్యా భోదన చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ఐడియల్ స్కూల్ యాజమాన్యం పై జిల్లా జిల్లా ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహారించాలి.