Karimnagar | రికార్డులకు ర్యాకులు లేవు.. కంప్యూటర్లకు ఇంటర్నెట్ లేదు..!
నూతన భవనాలు నిర్మించారు.. ప్రభుత్వ కార్యాలయాలకు గదులు కేటాయించారు.. ఆఘమేఘాల మీద కార్యాలయాలను తరలించారు.. కానీ, విధుల నిర్వహణకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పనను మాత్రం విస్మరించారు.
- పాత టేబుళ్లు, కుర్చీలతో సర్దుబాటు.. నేలపైనే రికార్డుల మూటలు
- కొత్త భవనంలో పాత కష్టాలు.. ఐడివోసీలో కానరాని ఫర్నీచర్
- ప్రజలకు అరకొర సేవలు

Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 29 : నూతన భవనాలు నిర్మించారు.. ప్రభుత్వ కార్యాలయాలకు గదులు కేటాయించారు.. ఆఘమేఘాల మీద కార్యాలయాలను తరలించారు.. కానీ, విధుల నిర్వహణకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పనను మాత్రం విస్మరించారు. ఫలితంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ)లో కొలువుదీరిన పలు ప్రభుత్వ శాఖలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్త భవనాల్లోకి వచ్చిన అధికారులకు పాత ఫర్నిచరే దిక్కవగా, విలువైన ప్రభుత్వ రికార్డులను భద్రపరిచేందుకు ర్యాకులు కూడా కరువయ్యాయి. కంప్యూటర్లకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో పరిపాలనా కార్యకలాపాలు సైతం నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్ లో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన కలెక్టరేట్ లో కొంత భాగం శిథిలావస్థకు చేరగా, కొత్త జిల్లా కేంద్రాలతో పాటు ఇక్కడ కూడా నూతన భవనం నిర్మించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించి, ఆదేశాలు కూడా జారీ చేశారు. 2021 డిసెంబర్ 29న రూ.51కోట్ల పైచిలుకు అంచనాలతో జీ ప్లస్ టూ విధానంలో సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణానికి అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరై శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి అయింది. ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారడంతో పనులు మందగించాయి. ఇతర జిల్లాల్లో కొత్త భవనాలు పూర్తయి, ప్రారంభం కూడా కాగా, ఇక్కడ మాత్రం పెండింగ్‌లో ఉండటంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం పై బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిధులు విడుదల చేయగా, నిర్మాణం పూర్తయి గత నెల 30న ప్రారంభించారు. కొత్త భవనం…కొత్త సామాగ్రి…సరి కొత్తగా సేవలందించవచ్చనే సంతోషంతో ప్రభుత్వ శాఖలు ఐడివోసీలోకి వచ్చి చేరాయి. అయితే, గదులు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోగా, ప్రజలకు సేవలందించేందుకు మౌలిక వసతుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయా శాఖల సిబ్బంది వాపోతున్నారు.
సొంత భవనాలున్న కార్యాలయాలు మినహా మిగిలిన ప్రభుత్వ శాఖలకు ఐడీవోసీలో గదులు కేటాయించారు. నిర్దేశించిన గడువులోగా కార్యాలయాలను తరలించకుంటే గదుల కేటాయింపును రద్దు చేస్తామన్న మౌఖిక ఆదేశాలతో అధికారులు, సిబ్బంది హడావుడిగా సామగ్రి, రికార్డులను తరలించారు. తీరా కొత్త భవనాల్లోకి చేరాక అసలు సమస్య మొదలైంది. కొత్త ఫర్నిచర్ అందుబాటులో లేక, పాత సామాగ్రి సరిపోక సిబ్బంది సతమతమవుతున్నారు.
తుప్పు, చెదలు పట్టిన పాత సామగ్రిని వదిలేసి కొత్త గదుల్లోకి రికార్డులను మాత్రమే తీసుకొచ్చారు. వాటిని భద్రపరిచేందుకు ర్యాకులు, అల్మారాలు లేకపోవడంతో ఫైళ్లు, రికార్డుల మూటలు నేలపైనే దర్శనమిస్తున్నాయి. కొన్ని ఆఫీసుల్లో పాత టేబుళ్లు, కుర్చీలతోనే సర్దుకుపోతున్నారు.నూతన భవనాలతోపాటే కార్యాలయాలకు అవసరమైన ఫర్నిచర్ కూడా సమకూరుతుందని అధికారులు భావించారు. అయితే, చివరి నిమిషంలో ఎవరి ఫర్నిచర్ వారే ఏర్పాటు చేసుకోవాలన్న సూచనలతో పలు శాఖల అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొన్ని శాఖలు సొంతంగా ఫర్నిచర్ తయారు చేయించుకుంటుండగా, మరికొన్ని శాఖలు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రతిపాదనలకు ఆమోదం, బడ్జెట్ విడుదల, కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యేసరికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ఇబ్బందులు తప్పే పరిస్థితులు తప్పేలా లేవని కింది స్థాయి సిబ్బంది పేర్కొంటున్నారు.
ఇంటర్నెట్ లేక ఇక్కట్లు!
ఫర్నిచర్ సమస్యకు తోడు ఐడీవోసీలో పూర్తిస్థాయి ఇంటర్నెట్ సదుపాయం కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో కంప్యూటర్ల ఆధారంగా జరగాల్సిన పనులు నిలిచిపోతుండగా, వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వస్తున్న ప్రజలకు సకాలంలో సేవలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. అత్యవసర కార్యకలాపాల కోసం సిబ్బంది తమ సెల్ఫోన్లను అనుసంధానం చేసుకుంటున్నారు. భవనాలు మారినా, పాలనలో వేగం పెరగకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోటకు చేర్చడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యం నెరవేరాలంటే, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాలని, ఫర్నిచర్, రికార్డుల భద్రతకు ర్యాకులు, అల్మారాలు, ఇంటర్నెట్ వంటి కనీస అవసరాలను తక్షణమే సమకూర్చాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. లేదంటే మరికొద్ది నెలలపాటు ఇబ్బందులు తప్పకపోవచ్చన్న ఆందోళన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కార్మికుల హాజరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ’
Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం
సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

