40 feet road expansion | కోల్ సిటీ , అక్టోబర్ 10: రామగుండం నగర పాలక సంస్థ లో మరో ఆపరేషన్ జరగబోతుంది. త్వరలో ఆపరేషన్ అశోకనగర్ కు సిద్ధమవుతోంది. గోదావరిఖని నగరంలోని లక్ష్మీనగర్ స్వతంత్ర చౌక్ (పాత పోస్టాఫీసు) నుంచి అశోక్ నగర్ మజీద్ వద్దకు ఉన్న గల్లీలో రోడ్ల వెడల్పు చేపట్టబోతుంది. దీనిలో భాగంగా శుక్రవారం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అశోక్ నగర్ లో 40 ఫీట్ల రోడ్డు వెడల్పు కోసమని మార్కింగ్ ఇచ్చారు. దీనితో బస్తీ వాసులు గుమిగూడి ఇక్కడ 40 ఫీట్ల రోడ్డు అవసరమా? అంటూ ప్రశ్నించారు.
అంత రోడ్డు వెడల్పుతో ఇళ్లు సగం వరకు కోల్పోయే పరిస్థితి ఉంటుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదంకు దిగారు. దీనితో తమకు పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే మార్కింగ్ కోసం వచ్చామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే నగర పాలక సంస్థ కార్యాలయంకు వెళ్లి అడగాలని సిబ్బంది సూచించారు. అనంతరం ఇళ్లకు మార్కింగ్ యధావిధిగా ఇచ్చారు. ఈ చర్యలతో కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.
శుక్రవారం రాజేష్ థియేటర్ జంక్షన్ వద్ద దుకాణాలను తొలగించిన మున్సిపల్ సిబ్బంది సాయంత్రం అశోక్ నగర్ లో నివాస గృహాలకు మార్కింగ్ ఇవ్వడంతో తదుపరి చర్యలు ఇక్కడే ఉంటాయని స్థానికులు బావిస్తున్నారు.