కార్మిక క్షేత్రంగా విలసిల్లుతూ.. అనేక పరిశ్రమలకు నిలయమైన సిరిసిల్లలో అతిపెద్ద మత్స్యపరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలింది. వేలాది మంది యువతకు ఉపాధి, పరిశోధనలకు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన ఆక్వాహబ్, మత్స్య యూనివర్సిటీలపై ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తున్నది. చీర్లవంచలో 365 ఎకరాల స్థలాన్ని కేటాయించి శంకుస్థాపనకు కసరత్తు పూర్తి చేసినా.. 2వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు సైతం ముందుకు వచ్చినా.. ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు అలసత్వంతో ఈ ప్రాజెక్టులు అటకెక్కినట్టు తెలుస్తున్నది. పాలకులు, అధికారులు ఏమాత్రం దృష్టి పెట్టకపోవడంతో జిల్లావాసులకు నిరాశే ఎదురవుతున్నది. ఇప్పటికైనా స్పందించి ఏర్పాటుకు చొరవ తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
రాజన్న సిరిసిల్ల, మే18 (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమలో తెలంగాణకే తలమానికమైన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పరిశ్రమల ఏర్పాటుకు నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. టెక్స్టైల్స్, అప్పారెల్ పార్కులను అభివృద్ధిలోకి తెచ్చింది. పొగచూరుతున్న బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి, మెరుగైన కూలీ కల్పించాలన్న ఉద్దేశంతో అప్పారెల్ పార్కులో రెండు అంతర్జాతీయ గార్మెంట్ పరిశ్రమలను ఇక్కడకు తీసుకువచ్చింది. ఆ కంపెనీల ఏర్పాటుతో ప్రస్తుతం రెండు వేల మంది మహిళలతో పాటు కొంత మంది పురుషులకు ఉపాధి లభించింది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన నీలి విప్లవంతో మత్స్య కార్మికులకు చేతినిండా పని దొరికింది.
రాజరాజేశ్వర, అన్నపూర్ణ, ఎగువ మానేరు ప్రాజెక్టులతో పాటు 440 చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల పంపిణీతో మత్స్య సంపద దండిగా పెరిగింది. 106 మత్స్య పారిశ్రామిక సంఘాల్లోని 7636 కుటుంబాలకు ఉపాధి దొరికింది. ఈ క్రమంలోనే మధ్యమానేరులో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం వివిధ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసింది. నర్సింగ్, మెడికల్, వ్యవసాయ పాలిటెక్నిక్, ఐటీఐ, అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేసింది. దీంతోపాటు పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దాలని, పది వేల మందికి ఉపాధి కల్పించాలని సంకల్పించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వాహబ్, మత్స్య యూనివర్సిటీలు అటకెక్కాయి. 2వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలకు సహకారం లేకపోవడంతో వెనకడుగు వేశాయి.
సిరిసిల్లను పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అప్పటి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ మత్స్య యూనివర్సిటీతోపాటు మధ్యమానేరు నిర్వాసిత కుటుంబాలకు ఉపాధి కోసం ఆక్వాహబ్ ఏర్పాటుకు సంకల్పించారు. పదివేల మంది వరకు ఉపాధి పొందేలా ప్రతిపాదనలు చేశారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో 365 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ క్రమంలో 2 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన ఫిషిన్ ఇండియా, ప్రెష్హోం, ఆనందాగ్రూప్, సీపీ ఆక్వా సంస్థలు ముందుకువచ్చి, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఫిషిన్ ఇండియా కంపెనీ శ్రీరాజరాజేశ్వర జలాశయంలో కేజీ కల్చర్‌ను ట్రయల్ రన్ నిర్వహించింది.
ఈ సంస్థకు 125 ఎకరాల స్థలం కేటాయించగా, ఈ ప్రాజెక్టులకు అప్పటి ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. అప్పుడే ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రహణం పట్టింది. సర్కారు దీనిపై ఏమాత్రం దృష్టిసారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వమే గనుక ఉంటే యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగి, భవన నిర్మాణాలు పూర్తి దశకు వచ్చేవని, ఆక్వాహబ్ ప్రారంభమై వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభించేందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత సర్కారుతో వివిధ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, ఈ ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ముందుకు రావడం లేదన్న చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం స్పందించి మత్స్య యూనివర్సిటీ, ఆక్వాహబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.