వేములవాడ, జూన్ 25: హైకోర్టులో స్టే ఉన్నా భవనాలను కూల్చడం సమంజసమేనా? అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ప్రధాన రహదారి విస్తరణ నిర్వాసితులు బుధవారం పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో తాము అభివృద్ధిని అడ్డుకోవడం లేదని పేర్కొన్నారు. విస్తరణలో భూసేకరణ చట్ట వ్యతిరేకంగా చేస్తున్నందున ప్రశించడం కూడా తప్పా? అని తెలిపారు. తమ ఆస్తుల విలువలను ఇష్టానుసారంగా మదింపు చేయడాన్ని ప్రశ్నించడం తప్పా అని పేర్కొన్నారు.
అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని, వేములవాడ మూలవాగుపై రెండో వంతెన నిర్మాణాన్ని ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వేములవాడకు వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతులు కల్పించకుండా మదింపు చేసిన వేములవాడను ‘నీవే కాపాడాలి రాజన్న.. మీ సహాయ సహకారాలు ఆశిస్తూ మెయిన్ రోడ్ భూసేకరణ నిర్వాసితులు” అని ప్లెక్సీలో విజ్ఞప్తి చేస్తున్నట్లు పేరొన్నారు. ప్రధాన రహదారిలోని దుకాణాల ఎదుట వెలిసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు.