Ramagundam | కోల్ సిటీ, ఆగస్టు 7 : పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు ఇవ్వడమే మొదటి సహజమైన టీకా అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని రామగుండం నగర పాలక సంస్థ 21, 22, 23, 46 డివిజన్ల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలతో కలిసి ఒకే వేదికపై వేడుకలను శుక్రవారం నిర్వహించారు. నగర మేయర్ ముఖ్యతిథిగా హాజరై తల్లి పాల ప్రాముఖ్యతను వివరించారు. ఆరు నెలల వరకు ముర్రుపాలే బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం చిన్నారులకు అన్న ప్రాసన, గర్భిణులకు సామూహిక సీమంతాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కన్నూరి శంకర్ భాగ్యలక్ష్మి, సునీత రాజిరెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, మెడికల్ ఆఫీసర్ అలేఖ్య, అంగన్వాడీ టీచర్లు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.