జగిత్యాల/ మెట్పల్లి, ఆగస్టు 9 : పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి అనిరుధ్ మృతి ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, అస్వస్థతకు గురైన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో విద్యార్థి మృతదేహాన్ని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పరిశీలించారు. విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అంతకు ముందు అస్వస్థతకు గురై మెట్పల్లి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న మల్యాల మండలం తాటిపెల్లికి చెందిన హేమంత్యాదవ్ను, నిజామాబాద్‌లో చికిత్స పొందుతున్న మెట్పల్లి మండలం ఆత్మకూర్‌కు చెందిన మోక్షిత్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
అనిరుధ్ కుటుంబంతో పాటు ఇటీవల మృతిచెందిన ఆరపేట గ్రామానికి చెందిన రాజారాపు గణాదిత్య కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఇలాంటి ఘటనలు రెండు సార్లు జరగడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయమై అదనపు కలెక్టర్ గౌతమ్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాయిరెడ్డి, బీఆర్ఎస్ మల్లాపూర్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, నాయకులు శీలం ప్రవీణ్, బోయపోతు గంగాధర్, ప్రతాప్, బైరి రాకేశ్, రవి, నాయకులు పాల్గొన్నారు.