నేతన్నలకు మేం వెన్నుదన్నుగా ఉన్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ భరోసా ఇచ్చాం. వందల కోట్ల రుణాలు మంజూరు చేసి వారి జీవనప్రమాణాలను మెరుగుపరుస్తున్నం. కానీ, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. చేనేత అభివృద్ధికి తోడ్పడాలని ఏడేండ్లుగా ఎన్నో వినతులు సమర్పించినా చోద్యం చూస్తున్నది. సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్లస్టర్ ఏర్పాటుకు ఎన్నో విజ్ఞప్తులు సమర్పించినా పట్టించుకోవడం లేదు. మన రాష్ర్టానికి కాకుండా మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్‌కు భారీగా నిధులు ఇస్తూ తెలంగాణపై సవతితల్లి ప్రేమను చూపుతున్నది. విజ్ఞప్తులు చేసీ చేసీ విసిగిపోయినం. ఇక విడిచిపెట్టం. రాబోయే కాలంలో చేనేత కార్మికుల పక్షాన ప్రత్యక్ష పోరాటం చేస్తం. మా డిమాండ్లు నెరవేరే దాకా క్షేత్ర స్థాయిలో ఎక్కడికక్కడ నిలదీస్తం.
సిరిసిల్ల/ సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 10 : స్వరాష్ట్రంలో చేనేత, మరమగ్గాల కార్మికుల బతుకులకు టీఆర్ఎస్ సర్కారు భరోసా కల్పించిందని, వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నల జీవితాలు మారడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. కానీ, చేనేత జౌళి రంగాల అభివృద్ధిపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. చేనేత అభివృద్ధికి తోడ్పడాలని ఏడున్నరేండ్లుగా ఎన్నో విజ్ఞప్తులు సమర్పించినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన సిరిసిల్ల జిల్లాకేంద్రానికి వచ్చారు. మొదట జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మంత్రి మాట్లాడారు. స్వరాష్ట్రంలో నేతన్న సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 1134 కోట్లతో బతుకమ్మ చీరెలు, క్రిస్మస్, రంజాన్, విద్యార్థుల యూనిఫాం వస్ర్తాల తయారీ ఆర్డర్లు ఇచ్చామని గుర్తు చేశారు. గతంలో 7వేలు సంపాదించే నేతన్న ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో 16 వేల నుంచి 20 వేలకుపైగా వేతనం పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.
ఇంకా వ్యక్తిగత రుణమాఫీ, మరమగ్గాల ఆధునీకరణ, త్రిఫ్ట్, చేనేత మిత్ర లాంటి కార్యక్రమాలు చేపటినట్టు తెలిపారు. కార్మికుడిని ఓనర్ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ‘వర్కర్ టూ ఓనర్’ పథకం తెచ్చిందని, అందులో భాగంగా అపెరల్ పార్కులో 400 కోట్లు పెట్టుబడి పెట్టిందని చెప్పా రు. పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన కేంద్రం, దండగగా మారిందని ధ్వజమెత్తారు. నేతన్నల సంక్షేమం కోసం ఏడేండ్లలో ఎన్నో విజ్ఞప్తులు చేశామని, సిరిసిల్లలో కార్మికుల అభ్యున్నతి కోసం మెగా పవర్‌లూం క్లస్టర్ ఏర్పాటుకు ఎన్నో వినతులు కేంద్రానికి సమర్పించానని గుర్తు చేశారు. అయినా మన రాష్ర్టానికి కాకుండా మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్‌లకు ఎన్నో నిధులు మంజూరు చేసిందని, తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమను చూపిస్తుందన్నారు. విజ్ఙప్తులు చేసి విసిగి వేసారామని ఇక రాబోయే కాలంలో చేనేత కార్మికుల పక్షాన పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కేంద్ర బడ్జెట్లో నేతన్నలకు బడ్జెట్ కేటాయించాలని లేకుంటే పార్లమెంట్లో అడ్డుకునే పరంపర కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు కలిసికట్టుగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ రాష్ట్ర సహా య కార్యదర్శి గూడూరి ప్రవీణ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, మాజీ అర్బన్ బ్యాంకు చైర్మన్ దార్నం లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
అమ్మా.. బాగున్నరా..పింఛన్లు వస్తున్నయా..
‘అమ్మా బాగున్నరా.. పింఛన్లు వస్తున్నయా..’ అంటూ మహిళలు, వృద్ధురాళ్లను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో టీఆర్ఎస్వై నాయకుడు గుగ్గిళ్ల శ్రీకాంత్ వివాహ విందు వేడుకలకు ఆయన హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ వచ్చారనే విషయం తెలుసుకున్న పక్కింట్లో ఉంటున్న వృద్ధురాలు నర్సవ్వ ఆయనను చూడాలని వచ్చింది. మంత్రిని పిలవగా, ఆయనే స్వయంగా వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలుకరించారు. పింఛన్లు వస్తున్నయా అమ్మా.. అని అడుగగా ‘వస్తున్నయ్ బిడ్డ’ అంటూ బదులిచ్చింది. ఎలా ఉన్నరు అని అడుగగా ‘బాగున్నం బిడ్డా’ అంటు చెప్పింది. ఆమె పక్కన ఉన్న కోడలు మహేశ్వరి తన కొడుకు రోహిత్(దివ్యాంగుడు)కు ట్రైస్కూటర్ ఇచ్చారని చెప్పింది. తర్వాత మరో మహిళ తమ అంకిరెడ్డిపల్లె ఊళ్లో కొందరికి పింఛన్లు వస్తలేవని చెప్పగా, మంత్రి కేటీఆర్ స్పదించి.. ‘మన ప్రభుత్వంలో చాలా ఎక్కువ మందికి పింఛన్లు ఇస్తున్నం.. కొత్త పింఛన్లు వచ్చే ఏప్రిల్ నుంచి వస్తయ్’ అని భరోసా ఇచ్చారు. దీంతో మహిళలు, వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలోని మహిళలు తారసపడగా ఎలా ఉన్నారని పలుకిరించారు. ‘అందరూ వ్యాక్సిన్ వేసుకున్నరా..?’ అంటూ అడిగి తెలుసుకున్నారు.