కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) :సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో కరీంనగర్ అద్భుత జిల్లాగా మారబోతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే.. సీఎం హామీ పథకం కింద వచ్చిన రూ.342 కోట్ల నుంచి రూ.210 కోట్లతో నగరంలోని ప్రధాన, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, తాగు నీటి పైప్ లైన్లు వసుకున్నాం. పార్కులు, మార్కెట్లు, శ్మశాన వాటికలు వంటి పనులు చేపట్టాం. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. నగరంలో స్మార్ట్ సిటీ కింద చౌరస్తాలను ఆధునీకరించాం. రూ.18 కోట్లతో సెంట్రిల్ లైటింగ్ ఏర్పాటు చేశాం. మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తయితే నగరానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఈ పనులు ఇప్పటికే 25 శాతం పూర్తయ్యాయి. మిగతావి శరవేగంగా జరగుతున్నాయి. ప్రపంచంలోని సియోల్, చైనాలో మొదటి రెండు ఫౌంటేన్లకు ధీటుగా కరీంనగర్లో మూడో ఫౌంటేన్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల భద్రత మా బాధ్యతగా తలచి కరీంనగర్‌ను భావితరగాలకు ఒక సేఫ్ నగరంగా అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం.
మన పథకాలు దేశానికే తలమానికం
తెలంగాణ ప్రభుత్వం దేశానికే తలమానికంగా ఉండే విధంగా అనేక పథకాలు అమలు చేస్తోంది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో సాగు నీటి ప్రాజెక్టులు తెచ్చి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తున్నారు. రైతులకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేశారు. ఈ సీజన్లో 8,072 మంది రైతులకు రూ.2.12 కోట్ల విలువైన పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశాం. ఈ సీజన్లో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచాం. ఈ వానకాలంలో రైతుబంధు కింద 1,77,762 మంది ఖాతాల్లో రూ.143.94 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాం. వివిధ కారణాలతో చనిపోయిన 423 మంది రైతులకు రైతుబీమా కింద రూ.21.15 కోట్లు అందించాం. 759 ఎకరాల్లో ఆయిల్ పాం సాగును ప్రోత్సహిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా అనేక పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు.