కార్పొరేషన్, ఏప్రిల్ 28: నగరంలో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు నివారించడం.. నగరవాసులకు పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయల కొనుగోలు చేసే అవకాశం కల్పించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన మినీ కూరగాయల మార్కెట్లు నిరుపయోగంగా మారుతున్నాయి. నూతన మినీ కూరగాయల మార్కెట్లలో విక్రయాలు చేపట్టేలా వ్యాపారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడంలో నగరపాలక సంస్థ అధికారుల అలసత్వం వల్ల అవి అక్కరకు రాకుండా పోతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ఓ వైపు రోడ్ల పక్కన ఇష్టారీతిగా సాగుతున్న కూరగాయల విక్రయాలతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతుండగా, వ్యర్థాలు పేరుకుపోయి పారిశుధ్య సమస్యలూ తలెత్తుతున్నాయి.
నగరంలోని జగిత్యాల మార్గంలో ఎస్ఆర్ఆర్ కళాశాల సమీపంలో అనేక మంది రోడ్డు పక్కనే కూరగాయల వ్యాపారాలు చేస్తున్నారు. దీని వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మూల మలుపుల్లోనే అమ్మకాలు సాగిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే, టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్డులో కరోనా కాలంలో ప్రజల సౌకర్యం కోసం కూరగాయల అమ్మకాలకు అవకాశం ఇచ్చారు. దీంతో ప్రస్తుతం అక్కడ కూడా మార్కెట్ రోడ్డుపైనే సాగుతున్నది. ఈ రెండు ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు మినీ కూరగాయల మార్కెట్లు నిర్మించారు. ఎస్ఆర్ఆర్ కళాశాల గోడను ఆనుకొని చైతన్యపురి రోడ్డులో మినీ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశారు. మరొకటి సప్తగిరి కాలనీ ప్రభుత్వ స్కూల్ గోడను ఆనుకొని నిర్మించారు.
ఫలించని ప్రయత్నాలు
ఆయా మార్కెట్లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు గతంలో పాలకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొన్ని రోజుల పాటు వ్యాపారులను ఆయా మార్కెట్లల్లోకి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ అమ్మకాలు నాలుగు రోజులకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు పకడ్బందీగా వ్యాపారులను ఈ మార్కెట్లకు తరలిస్తేనే ఉపయోగం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు పట్టింపు లేని ధోరణితో వ్యవహరించడం వల్లే ఏదైనా నాలుగు రోజులే అన్నట్లుగా కార్యక్రమం సాగుతున్నది. ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ కళాశాల రోడ్డులో దారిపొడవున అడ్డగోలుగా పండ్లు, కూరగాయల మార్కెట్ జోరుగా సాగుతున్నది. వీరందరినీ మినీ మార్కెట్ వైపుగా తరలిస్తే ఆ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు తీరే అవకాశం ఉంది. కానీ ఈ దిశగా నగరపాలక సంస్థ అధికారులు దృష్టి సారించడం లేదు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు ఈ మినీ మార్కెట్లను వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.