గోదావరిఖని, జూలై 28: సింగరేణి ఆర్జీ-1 పరిధిలో ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మండిపడ్డారు. ఆదివారం జీడీకే టూఇైంక్లెన్ గనిలో జరిగిన ప్రమాదంలో గాయపడి సింగరేణి ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న శంకర్, నోయల్ కార్మికులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గని కార్మికుల ప్రాణాలతో యాజమాన్యం చెలగాటమాడుతోందన్నారు. ప్రమాద కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి అధికారులు సీఎం, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడానికే పని చేస్తున్నట్లు కనబడుతోందన్నారు. కార్మికుల భద్రత ప్రమాణాలను పాటించడం లేదన్నారు. ఇక్కడ టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రామమూర్తి, వడ్డెపల్లి శంకర్, చెల్పూరి సతీశ్, జెవి రాజు, పర్లపల్లి రవి, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, చెలకలపల్లి శ్రీనివాస్, శేషగిరి కిరణ్, మహేందర్, కనకరాజ్, వెంకటేశ్ ఉన్నారు.