TBGKS | గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బొగ్గు బ్లాక్‌ల వేలంలో సింగరేణి సంస్థ మణుగూరు పీకే ఓసీపీ-2 ఎక్స్ టెన్షన్ బ్లాకును ప్రైవేట్ వ్యక్తులకు దార దత్తం చేసే కుట్ర జరుగుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జనవరి 8న జరిగే బొగ్గు బ్లాక్ ల వేలంలో మణుగూరు పీకే ఓసిపి-2 బ్లాకును వేలం ద్వారా అమ్మేందుకు నిర్ణయించారని ఆయన ఆరోపించారు. దీనిని అడ్డుకోవాల్సిన సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీలు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ సింగరేణి కూడా వేలంలో పాల్గొంటుందని చెబుతూ నష్టం చేసే విధంగా చూస్తున్నారన్నారు. జనవరి 8న జరిగే వేలంపాటలో మొత్తం ఏడు సంస్థలు పాల్గొంటున్నాయని, అందులో సింగరేణి పాల్గొని ఆ బ్లాక్ దక్కకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనేది ముందుగానే పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
పోటీ మార్కెట్లో బ్లాక్ దక్కుతుందా..? లేదా అనేది మన చేతిలో ఉండదని, ఈ కారణంగానే వేలంపాటను నిర్వహించకుండా అడ్డుకోవాలని ఆయన కోరారు. బొగ్గు బ్లాక్ ల వేలంపై గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలని వారు ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తే కార్మికులు సహించరని ఆయన స్పష్టం చేశారు. బొగ్గు బ్లాక్ ల వేలానికి వ్యతిరేకంగా టీబీజీకేఎస్ కలిసివచ్చే కార్మిక సంఘాలతో ఐక్య పోరాటాలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు మాదాసి రామ్మూర్తి సురేందర్ రెడ్డి, నూనె కొమురయ్య, పర్లపల్లి రవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.