జగిత్యాల, ఏప్రిల్ 20, (నమస్తే తెలంగాణ) : సాధారణంగా మనిషి ఆహ్లాదంగా, మంచి అనుకూల వాతావరణంలో ఉండాలంటే ఇంట్లో 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. అయితే, మన రాష్ట్రంలో మార్చి చివరి వారం నుంచే వాతావరణంలో మార్పులు ప్రారంభమయ్యే విషయం అందరికీ తెలిసిందే. మార్చి చివరి వారం నుంచి ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. ఇండ్లలో సైతం 45 డిగ్రీలకు పైగా వేసవి తీవ్రత ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఆశ్రయిస్తున్నారు.
నిజం చెప్పాలంటే మార్చి చివరి నుంచి జూన్ మూడో వారం వరకు విద్యుత్ వాడకం తీవ్రంగా పెరిగిపోతున్నది. మిగతా నెలలతో పోలిస్తే ఈ మూడు నెలల్లో విద్యుత్ వాడకం రెండు రెట్లు అధికంగా ఉంటున్నది. అయితే, ఈ వినియోగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని తెస్తున్నది. వినియోగదారుడు సైతం రూ.వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చల్లని పైకప్పు (కూల్‌రూఫ్) సిస్టంను అమలులోకి తేవాలని నిర్ణయించింది. రానున్న ఐదేండ్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడంతోపాటు మున్సిపాలిటీలకు మార్గదర్శకాలు, లక్ష్యాలను ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీల్లో నిర్మించే భవనాలకు దాదాపు కచ్చితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపాలిటీల్లో కూల్‌రూఫ్ విధానాన్ని ప్రభుత్వం ఏప్రిల్ 1న అమలులోకి తీసుకొచ్చింది. భవన నిర్మాణానికి అనుమతులు తీసుకునే టీఎస్‌బీపాస్ చట్టం కిందే ఈ విధానాన్ని సైతం అమలు చేయాలని నిర్దేశించారు. 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన నివాస యోగ్యమైన భవన నిర్మాణాలకు కూల్‌రూఫ్ ఏర్పాటును తప్పనిసరి చేశారు. దాదాపు అంతే నిర్మాణంలో నిర్మించే అపార్ట్మెంట్లు సైతం అదే కోవలోకి వస్తాయని ప్రకటించారు. 600 గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునే వారికి ఈ విధానాన్ని ఐచ్ఛికంగా మార్చారు. ప్రభుత్వం నిర్మించే భవనాలు, వ్యాపార వాణిజ్య భవనాలు, ప్రైవేట్ వ్యక్తుల వ్యాపార వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆధీనంలో నిర్మించే నివాసగృహాలు, వసతిగృహాలకు ఈ విధానం కచ్చితం చేశారు. దీని అమలు తీరును డీటీసీపీ ఆధ్వర్యంలో బల్దియా అధికారులు పర్యవేక్షించాలని జీవోలో పేర్కొన్నారు. కూల్‌రూఫ్ నిర్మించుకున్న వాటికే మున్సిపల్ అధికారులు ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కూల్ రూఫ్ అంటే..
సహజంగా గతంలో ఇండ్ల నిర్మాణాలన్నీ మట్టితో జరిగేవి. వీటి పైకప్పులు పెద్దగా ఉష్ణోగ్రతను స్వీకరించకపోవడంతో వేసవిలో ఇండ్లలో ఎండ తీవ్రత తక్కువగా ఉండేది. అయితే, కాలక్రమంలో భవనాల నిర్మాణానికి సంబంధించి సిమెంట్, ఇసుకను వినియోగించడం ప్రారంభమైంది. సిమెంట్, కాంక్రీట్‌తో గోడలు, పైకప్పులు నిర్మించడంతో ఎండ తీవ్రతకు అవి త్వరగా వేడెక్కి, గదిలోపల వేడికి ఉండలేని పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో పైకప్పు వేసే సమయంలో త్వరగా వేడెక్కి, ఆలస్యంగా చల్లారే గుణం ఉన్న సిమెంట్, ఇసుక, కాంక్రీట్‌పై ఇతర రసాయనాలను పూయాలని నిర్ణయించారు. సూర్యకిరణాలు పైకప్పుపై పడిన తర్వాత అవి పరావర్తనం చెందేలా పైకప్పుపై ప్రత్యేక పూతలు పూస్తారు. ఈ పూతల కోసం లైమ్‌వాష్/ అక్రిలిక్ పాలిమర్/ ప్లాస్టిక్ సాంకేతికతను వినియోగిస్తారు. అలాగే, మరో విధానంలో పాలివినీల్ క్లోరైడ్ విధానంలో పైకప్పును తీర్చిదిద్దుతారు. ఇక మరో పద్ధతిలో అల్బిడో, సిరామిక్ మొజాయిక్ టైల్స్‌ను పైకప్పులో అమర్చుతారు. ఇవి తక్కువ వేడిని గ్రహిస్తాయి. దీంతో గదుల్లో వేడి తీవ్రత తగ్గిపోతుంది. ఈ పద్ధతిలో పైకప్పును రూపొందిస్తే ఇండ్లలో వేడి తీవ్రత దాదాపు 80 శాతం వరకు తగ్గిపోతుందని, 30 డిగ్రీలలోపే ఊష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంటుంది.
ఆదేశాలు వచ్చాయి
కూల్‌రూఫ్ విధానం పట్టణాల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ భవనాలు, వాణిజ్య భవనాలు, సామాజిక భవనాలన్నీ ఇక నుంచి కూల్‌రూఫ్ విధానంలోనే నిర్మించాల్సి ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులు సైతం తాము నిర్మించుకునే ఇండ్లకు కూల్రూఫ్లను ఏర్పాటు చేసుకోవాలి. టీఎస్‌బీపాస్‌లో కూల్రూఫ్ను కచ్చితం చేశారు. భవన నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలి. ఇక నుంచి నిర్మించే నిర్మాణాలన్నీ నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీనివాస్, పట్టణ ప్రణాళికా అధికారి (జగిత్యాల)