వీణవంక, జూలై 5 : మల్లారెడ్డిపల్లి – చల్లూరు రోడ్డు అధ్వానంగా మారింది. ఇసుక, గ్రానైట్ లారీల రాకపోకలతో అడుగుకో గుంత ఏర్పడి, వాహనదారులకు నరకం చూపిస్తున్నది. మల్లారెడ్డిపల్లి గ్రామస్తులు ఏ అవసరం పడినా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా, రోగులు దవాఖానకు వెళ్లాలన్నా, కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చల్లూరు మీదుగా పోవాల్సిందే. వానకాలం వస్తే చాలు ఈ రోడ్డు ఆనవాళ్లే లేకుండా పోతున్నది. ఆర్టీసీ బస్సు రాక విద్యార్థులు ఆటోల్లో ప్రయాణిస్తూ ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి దాపురించింది.
రోడ్డు నిర్మించాలని ఏండ్లుగా ప్రజలు ధర్నాలు చేసినా, నిరసనలు తెలిపినా పట్టించుకునే దిక్కే లేకుండాపోయింది. గుంతలు పడిన రోడ్లపై ప్రమాదాలు జరిగి ఎంతో మంది గాయపడ్డా అధికారుల్లో చలనం కరువైంది. అయితే రోడ్డు నిర్మాణం కోసం గతంలో ఎంఆర్ఆర్ నిధులు మంజూరుకాగా, కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టి బిల్లులు రాక వదిలేసినట్టు తెలిసింది. గతేడాది హమ్ ప్రాజెక్ట్‌కు మల్లారెడ్డిపల్లి సెలెక్ట్ అయినప్పటికీ ఇప్పటికీ టెండర్ పూర్తి కాలేదని తెలుస్తుండగా, ప్రభుత్వం స్పందించి త్వరగా రోడ్డు నిర్మించాలని ప్రజానీకం కోరుతున్నది.