Godavarikhani | గోదావరిఖని : బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే స్థాయి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్‌కు లేదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి, వ్యాల్ల హరీష్ రెడ్డి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ నియామకాలపై ఎలాంటి అవగాహన లేకుండా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 70 వేల ఉద్యోగాలను ఇచ్చిందని పేర్కొనడం ఆయన అవగాహన రాయిత్యాన్ని తెలియజేస్తుందన్నారు. తమ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఇది కాదని నిరూపించాలని కేటీఆర్ ను మక్కాన్‌సింగ్ అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఇది నిరూపించకుంటే ఆయన రాజీనామా చేస్తాననడం స్వాగతిస్తున్నామని, ఆయన గోదావరిఖని చౌరస్తాకు వచ్చి ఉద్యోగ నియామకాలపై మాట్లాడాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 15 వేల ఉద్యోగాలను మాత్రమే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిందని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 50 వేల పైచిలుకు ఉద్యోగాలను తాము ఇచ్చినట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుందని ఇది కాదని నిరూపించగలరా అని వారు ప్రశ్నించారు. ఈ విషయంలో గోదావరిఖని చౌరస్తాలో వచ్చి మక్కాన్‌సింగ్ మాట్లాడాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగాల విషయంలో తప్పుడు లెక్కలు చెప్పిన మక్కన్ సింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడా అంటూ వారు ప్రశ్నించారు.
రామగుండం నియోజకవర్గంలో రెండున్నర సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదని, కేవలం కూల్చివేతలు తప్ప మరొకటి లేదని వారు తీవ్రంగా విమర్శించారు. సింగరేణి ఆధ్వర్యంలో కాంప్లెక్సులు నిర్వహిస్తామని చెప్పి అవి సాధ్యం కాకపోవడంతో పక్కనపెట్టి వ్యాపారులను నట్టేట ముంచుతున్నారని వారు ఆరోపించారు. బూడిద దందాలో రోజుకు రూ.లక్షలు సంపాదిస్తున్న ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ దమ్ముంటే వ్యాపారుల సముదాయాలను కూల్చిన స్థానంలో వేరే కట్టడాలను తన సొంత ఖర్చులతో కట్టించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే రామగుండంలో ఎలాంటి అభివృద్ధి పనులు లేక కేవలం ప్రచారాలకి ఎమ్మెల్యే అనుచరులు పరిమితమవుతున్నారని వారు విమర్శించారు. ఈ సమావేశంలో మూల విజయ రెడ్డి మురళీధర్ రావు, పర్లపల్లి రవీందర్, జేవి రాజు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.