MLC Elections | సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 27 : జిల్లాలో శాసనమండలి ఎన్నికల పోలింగ్ సజావుగా సాగిందని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్త్ ఏక్కా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్త్ ఏక్కా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశృలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్త్ ఏక్కా మాట్లాడుతూ.. జిల్లాలోని 50 పోలింగ్ కేంద్రాలలో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో పురుషులు 3982 మంది, మహిళలు 2501 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీచర్స్ ఎన్నికలలో పురుషులు 313 మంది, మహిళలు 211 మంది మొత్తం 525 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత కరీంనగర్లో ఉన్న రిసెప్షన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్‌లను తరలించడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో తహసిల్దార్ రామచందర్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.