కరీంనగర్ తెలంగాణచౌక్, డిసెంబర్ 7 : షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌పై వెలమ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లోని ప్రెస్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించిన అనంతరం పద్మనాయక వెలమ సంఘం జిల్లా అధ్యక్షుడు జువ్వాడి వేణుగోపాల్‌రావు, ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో అక్కడి నుంచి టూటౌన్ పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి, ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మత, ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా ఉంటానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే శంకర్ ఒక కులాన్ని అసభ్య పదజాలతో దూషించడం సముచితం కాదని హితవుపలికారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ స్పందించి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ వెలమ సంఘం సభ్యులు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో షాద్‌నగర్ ఎమ్మెల్యే ఫ్లెక్సీని దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం పట్టణ సీఐ తిరుమల్ గౌడ్, హుజూరాబాద్ తహసీల్దార్ కనకయ్యకు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
జమ్మికుంట పోలీస్ స్టేషన్లో మున్సిపల్ చైర్మన్, వెలమ సంఘం అధ్యక్షుడు తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, సంఘం నాయకులు షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా వెలమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు పెద్దపల్లి ఏసీపీ గజ్జికృష్ణను కలిసి ఫిర్యాదు చేసి, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని, వెలమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పద్మనాయక వెల్మ సంక్షేమ సంఘం చందుర్తి మండల శాఖ ప్రతినిధులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.