Bhubharati re-survey | ఓదెల, అక్టోబర్ 6 : భూభారతి రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో భూ భారతి రీసర్వే కార్యక్రమాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల హద్దుల నిర్ధారణ, సమగ్ర భూ రికార్డుల రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. రీ సర్వే సమయంలో రైతులు, ప్రజలు అధికారులకు పూర్తి సహకారం అందించాలన్నారు. సర్వే అనంతరం 21 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరించనున్నట్లు తెలిపారు. భూ వివరాల ఆన్లైన్ నమోదు అనంతరం భూధార్ కార్డులను జారీ చేస్తారని పేర్కొన్నారు. భూ భారతి రీ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి భూమి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించి, సమగ్ర భూ రికార్డులను రూపొందించనున్నట్లు తెలియజేశారు. తెలంగాణ ప్రాంతంలో చివరిసారిగా 1938లో భూ సర్వే జరిగిందని తెలిపారు. అనేక సంవత్సరాల అనంతరం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సమగ్ర రీ-సర్వే నిర్వహించాలని నిర్ణయించిందన్నారు.
భూముల హద్దులు, రికార్డులలో మార్పులతో సమస్యలు
గతంలో ఒక సర్వే నంబర్లోని భూమి ఒకే వ్యక్తి వద్ద ఉండేదని, కాలక్రమేణా కొనుగోళ్లు, అమ్మకాలు, వారసత్వ బదలాయింపులు తదితర కారణాలతో భూములు అనేక చేతులు మారాయని తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో మార్పులు జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రతి భూమికి సంబంధించిన ఖచ్చితమైన మ్యాప్ అందుబాటులో లేకపోవడం వల్ల భూముల విస్తీర్ణంలో తేడాలు, హద్దులకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్లో భూ వివాదాలకు అవకాశం లేకుండా చేయడమే సమగ్ర రీ-సర్వే ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కంకణాల లావణ్య-భాస్కర్ రెడ్డి, పడాల భాగ్యలక్ష్మి-రాజు తహసీల్దార్ వనజ, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.