‘మీ అందరికీ ఇచ్చే మాట ఒకటే. నేను ఏదో దూరంగా ఉన్నానని అనుకోకండి. మీరందరూ నా గుండెకు దగ్గరగా ఉన్నరు. ఏ చిన్న కష్టం ఉన్నా.. ఏ అవసరం ఉన్నా.. అధికారం ఉన్నా, లేకున్నా తప్పకుండా మీకు తోడుంటా. అండగా నిలబడతా’ అని సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అభయమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను మరిచి హత్యా రాజకీయాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, వెంగళ వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగేదాకా వెన్నంటి ఉంటామని, బాధిత కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని, అతడి కుమార్తె చదువు, భవిష్యత్ బాధ్యత తనదేనని భరోసా కల్పించారు. బుధవారం వీర్నపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 1371 మందికి కండ్లద్దాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, తర్వాత సిరిసిల్లలో ఇటీవల హత్యకు గురైన వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించారు.
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ స్వీయ అనుభవంతోనే ‘కంటి వెలుగు’ మొదలైందని, ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గ్రామం, తండాలో అన్నీ రకాల కంటి పరీక్షలు చేయించాలని చెప్పి నాడు కంటి వెలుగు శిబిరాలు పెట్టి అద్దాలు ఇచ్చామని, కోట్లాది మంది ప్రజలకు మేలు చేశామని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ పేరంటేనే నచ్చడం లేదని, అందుకే అనేక పథకాలను పక్కకు పెడుతున్నదని మండిపడ్డారు. ఈ పథకాన్ని అమలు చేసినా, చేయకున్నా రాజన్న సిరిసిల్ల జిల్లాకు మాత్రం చేయాలనే నిర్ణయించుకున్నానని వివరించారు.

అందులో భాగంగానే హైదరాబాద్‌లోని వైద్యుడు అసద్ సబేరి సహకారంతో ఇటీవల మొదటగా వీర్నపల్లి మండలంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని చెప్పారు. వీర్నపల్లి, గర్జనపల్లిలో నాలుగు రోజుల పాటు క్యాంపులు పెట్టి 5 వేల మందికి స్క్రీనింగ్ టెస్టులు చేయించామని, ఇందులో ఈ రోజు 1371 మందికి కండ్లద్దాలు అందిస్తున్నామని తెలిపారు. ఇందులో పిల్లలు 250 మంది ఉన్నారని వాళ్లు చదువుతున్నారో.. ఫోన్లు చూస్తున్నారో.. తెలవదని, వారికి కూడా కంటి అద్దాలు ఇస్తున్నామని చెప్పారు. అలాగే 171 మందికి కంటి శుక్లాలు, ఇతరత్రా సమస్యల వల్ల ఆపరేషన్ అవసరం పడుతున్నదని, వారు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదని సిరిసిల్లలోనే మన ప్రభుత్వ హయాంలో రూ.6 కోట్లతో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన పెట్టించినట్టు వివరించారు.
వీర్నపల్లికి బండి వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని సిరిసిల్లలో ఆపరేషన్ చేయించి మళ్లా మీ ఇంటిదగ్గర దిగబెట్టే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీరందరికీ కంటి ఆపరేషన్లు చేయించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. వీర్నపల్లిలో త్వరలోనే వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కంటి వెలుగును వీర్నపల్లితో పాటు మన సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాలతో పాటు సిరిసిల్ల మున్సిపల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తర్వాత వేములవాడ నియోజకవర్గంతో పాటు బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో ఏర్పాటు చేసుకుందామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంతగా కంటి వెలుగు శిబిరాలు నిర్వహించుకుందామని వివరించారు. ప్రభుత్వానికి సోయివచ్చి వాళ్లు మొదలు పెట్టినా మంచిదేనని, ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. సర్కారు చేసినా, చేయకపోయినా, మన నియోజకవర్గంలో, మన జిల్లాలో దిగ్విజయంగా చేసుకుందామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తున్నదని, నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని కేటీఆర్ అభయమిచ్చారు. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, వెంకటేశం భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబం వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. అతని కుమార్తె తండ్రి కోసం ఎదురు చూస్తూ మూడు రోజులుగా తినలేదని చెప్పడం తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. తాను కేవలం సిరిసిల్ల ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, ఆ కుటుంబానికి మాట ఇచ్చిన సోదరుడిగా బాధ్యత తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు.
పదకొండేళ్ల వెంకటేశం కుమార్తె ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నదని, ఆమె పేరిట రూ.3 లక్షలు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఆమె మేజర్ అయిన తర్వాత ఆ మొత్తం అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేశామని, అంతేకాకుండా బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆమె చదువుతున్న పాఠశాల కరస్పాండెంట్‌తో తాను స్వయంగా మాట్లాడినట్లు చెప్పారు. పదో తరగతి వరకు బాలిక చదువుకు సంబంధించిన ఫీజులు తదితర ఖర్చుల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. టెన్త్ తర్వాత ఏం చదువుకోవాలనుకున్నా, ఆమె చదువు కొనసాగించే బాధ్యత తాను తీసుకుంటానని ఆమె తల్లికి ఈ విషయంలో మాట ఇచ్చినట్టు తెలిపారు. పార్టీ తరపున కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. వెంకటేశం కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులను ఆశ్రయించినప్పటికీ, నెలల తరబడి తిప్పించుకున్నట్టుగా తనతో చెప్పారని వెల్లడించారు.
కుటుంబానికి ఇల్లు మంజూరు చేయమని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశానని, ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ తరఫున తామే ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఘటన వెనుక అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను డిమాండ్ చేశారు. రాజకీయంగా తమను ఎదురోవాలంటే ఎన్నికల్లో తలపడాలని, రాజకీయ విమర్శలు చేయవచ్చని, కేసులు పెట్టవచ్చని, కానీ సామాన్య ప్రజలను బలిపశువులుగా మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదని హెచ్చరించారు. తెలంగాణ రాజకీయాల్లో తాను దాదాపు 20 ఏళ్లుగా ఉన్నానని, ఇంత దిగజారిన, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయాన్ని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.